కలిసి పనిచేయడానికి సిద్ధం: మోదీ
న్యూఢిల్లీ: విపత్తుల మూలంగా సంభవించే నష్టాలను తగ్గించే విషయంలో ప్రపంచదేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. గురువారం ఇక్కడ జరుగుతున్న డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 2016 ఆసియా మంత్రుల సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపత్తు నివారణకు సంబంధించిన వనరుల అభివృద్ధికి ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామన్నారు. ఆర్థిక వృద్ధిపై విపత్తులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని.. వీటి తీవ్రతను తగ్గించడానికి విశాల దృక్పథంతో, సృజనాత్మకంగా ఆలోచించాల్సిన అవసరముందన్నారు.
విపత్తు నిర్వహణలో మహిళల ప్రాధాన్యతను పెంచాల్సిందిగా సదస్సులో పాల్గొన్న దేశాలను మోదీ కోరారు. విపత్తులపై 10 అంశాలతో కూడిన ఎజెండాను ప్రకటించిన ఆయన.. విపత్తుల నివారణకు యూనివర్సిటీల నెట్వర్క్ అభివృద్ధి చెందాలన్నారు. విపత్తుల నివారణకు భారత్ తన వనరులు, స్పేస్ టెక్నాలజీని ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు.