అమెరికా వరదల్లో ఎన్నారై మహిళ మృతి
అమెరికాలోని హ్యూస్టన్ ప్రాంతంలో ఉన్నట్టుండి వచ్చిన వరదల కారణంగా ఎన్నారై మహిళతో సహా ఆరుగురు మరణించారు. అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. పలు ప్రధాన రహదారులు కూడా మునిగిపోయాయి. పాఠశాలలు మూతపడ్డాయి. బెషెల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీరుగా పనిచేస్తున్న సునీతా సింగ్ (47) ఉద్యోగానికి వెళ్తుండగా కారులోనే మరణించారు. ఉన్నట్టుండి వరదనీరు రావడంతో వాటిలో చిక్కుకుపోయి మరణించినట్లు తెలుస్తోందని ఓ అధికారి తెలిపారు.
ఉదయం 6.50 గంటల ప్రాంతంలో ఆమె తనకు ఫోన్ చేసి ఇబ్బందిలో ఉన్నట్లు చెప్పారని ఆమె భర్త రాజీవ్ సింగ్ తెలిపారు. ఆమెకు వెంటనే సాయం అందుతుందని అనుకున్నానని, కానీ అలా జరగకపోవడంతో ఆమె కారులోనే మరణించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరో వ్యక్తి 18 చక్రాల క్యాబ్ మునిగిపోవడంతో మరణించిడు. ఇంకో ఇద్దరు రెండు వేర్వేరు వాహనాల్లో మరణించారు. వాలర్ కౌంటీలో 56 ఏళ్ల టీచర్ కూడా తన వాహనం మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. బుష్ ఇంటర్నేషనల్, హాబీ విమానాశ్రయంలో 470 విమానాలను రద్దుచేశారు. రాత్రికి రాత్రి భారీ వర్షం కురవడంతో 8 నుంచి 16 అంగుళాల వరకు నీళ్లు చేరుకున్నాయి.