11 ఏళ్లుగా రివర్స్‌గేర్...
ఏదైనా పనిని అందరిలా కాకుండా విభిన్నంగా చేస్తే ఆ వ్యక్తికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఈ సూత్రాన్ని హర్‌ప్రీత్ దేవ్ చక్కగా ఒంటబట్టించుకున్నాడు. కారును ముందుకు కాకుండా వెనక్కి నడిపించడంలో సిద్ధహస్తుడయ్యాడు. పంజాబ్‌లోని భటిండాకు చెందిన ఈయన.. అక్కడివారందరికీ సుపరిచితుడే. గత 11 సంవత్సరాలుగా తన ఫియట్ పద్మినీ కారును ఇలా వెనక్కే నడుపుతున్నాడు. ఇంతకీ ఈ రివర్స్ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే 2003కి వెళ్లాల్సిందే. ఓ రోజు అర్ధరాత్రి వేళ హర్‌ప్రీత్ కారు రివర్స్ చేస్తుండగా గేర్ అలాగే ఉండిపోయింది. ఎంత ప్రయత్నించినా గేర్ మారలేదు. దీంతో నగర శివార్ల నుంచి భటిండా వరకు రివర్స్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు.
అప్పుడే ఈ రివర్స్ డ్రైవింగ్ ఆలోచన వచ్చింది. అంతే, అప్పటి నుంచి అలా రివర్స్‌గానే వెళుతున్నాడు. ముందుకెళ్లడానికి ఒకటి, రివర్స్ వెళ్లడానికి నాలుగు గేర్లు ఉండేలా గేర్‌బాక్సును కూడా మార్పించాడు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే రివర్స్ డ్రైవింగ్ చేయడానికి వీలుగా ప్రత్యేకమైన లెసైన్సు కూడా పొందాడు. వెనక్కి డ్రైవింగ్ అంటే ఏదో నెమ్మదిగా వెళ్తాడనుకుంటే పొరపాటే. గంటకు అత్యధికంగా 50 మైళ్ల వేగంతో దూసుకెళతాడు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య శాంతి స్థాపన కోసం 2005లో రాజస్థాన్ నుంచి లాహోర్ వరకు వెనక్కి డ్రైవింగ్ చేశాడు. ఇలా వెనక్కి డ్రైవింగ్ చేయడం వల్ల మెడనొప్పి తదితర సమస్యలతో బాధపడుతున్నట్టు హర్‌ప్రీత్ చెప్పాడు. కష్టపడకుండా రికార్డులు సాధించడం కుదరదు కదా? అందుకే ఇవన్నీ భరిస్తున్నట్టు వెల్లడించాడు. నిజమే కదా..!