మనం విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మన ముందు పంచభక్ష పరమన్నాలు పెట్టినా తినబుద్ధి కాదు.
న్యూఢిల్లీ: మనం విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మన ముందు పంచభక్ష పరమన్నాలు పెట్టినా తినబుద్ధి కాదు. కడుపులో ఎలుకలు గోల చేస్తుంటే గిచ్చుకుంటూ గిచ్చుకుంటు తిని ఏదో తిన్నామనిపిస్తాం. ఈ విషయంలో ప్రయాణిలను మెప్పించేందుకు వివిధ విమానయాన సంస్థలు రకరకాల ప్రయోగాలు చేసి విఫలమయ్యాయి. బ్రిటిష్ ఎయిర్ లైన్స్ అయితే 2013లో సెలబ్రిటీ చెఫ్ హెస్టన్ లాంటి నల భీములను తీసుకొచ్చి వండించి మరీ ప్రయాణికులను వడ్డించింది. అయినా ప్రయాణికులను తృప్తిపర్చలేక పోయింది. కాఫీ చేయడంలో కాకలుతీరిన యోధులను కూడా తీసుకొచ్చి ప్రయోగాలు చేసింది. అయినా ఆశించిన ఫలితం రాలేదు. ఎందుకు ఇలా జరుగుతుందో వంటా వార్పు తెలిసిన నిపుణులకు ఎంతకూ అర్థం కాలేదు. మొన్న మొన్ననే ఈ రహస్యాన్ని శాస్త్ర విజ్ఞాన నిపుణులు ఛేదించారు. విమానం 30 వేల అడుగులకు పైగా ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికుల నాలుకల్లో రుచిని గుర్తించే కణజాలం మొద్దుబారి పోవడమే ప్రధాన కారణం. ఎంత ఎత్తులో ప్రయాణిస్తున్నాం, విమానంపైనా, తెలియకుండా మనపై కలుగుతున్న ఒత్తిడి ఎంత ? అన్న అంశంపై మన నాలుకల్లోని రుచిని ఆస్వాదించే కణ జాలం ఎంత శాతం మొద్దుబారి పోతుందన్నది ఆధారపడి ఉంటుందని వారంటున్నారు. తీపి, పులుపు, ఉప్పు, చేదు, వగరు లాంటి రుచులను గుర్తించే కణజాలం నాలుకలపై వేలల్లో ఉంటుంది. ఆ కణ జాలం జీవితకాలం పట్టుమని పదిహేను రోజులే. నశించిన కణ జాలం చోట ఎప్పటికప్పుడు కొత్త కణ జాలం పుట్టుకొస్తుంది. వయస్సు మీరితే ఇదికాస్త మందగిస్తుంది.
భూ ఉపరితలంపై తయారు చేసిన వంటకాలను ఫ్రీజర్లలో భద్రపరిచి దాన్ని విమానంలోకి తీసుకొచ్చి మళ్లీ అక్కడ వేడి చే సి వండించడం వల్ల కూడా కొంత రుచిలో మార్పు రావడం రెండవ కారణం. విమానం క్యాబిన్‌లో ఉండే పొడి వాతావరణం కూడా ఆహార పదార్థాల రుచిపై ప్రభావం చూపించడం మూడం కారణమని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. ప్రయాణికులకు ఇష్టమైన ఆహార పదార్థాల్లో కొంత మెంతిని కలిపితే కొంతవరకు రుచిని రక్షించవచ్చని బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ నలభీములు అనుభవంతో చెబుతున్నారు. ఒక్క ఆహార పదార్థాలే కాకుండా విమానంలో సర్వ్‌చేసే వైన్స్ కూడా రుచిలేకుండా చప్పగుంటున్నాయట.
బ్రేవరీస్‌లో వైన్స్ తయారవుతున్నప్పుడు అవి నిర్దేశిత రుచిలో ఉన్నాయా అన్న విషయాన్ని రూఢీ చేయడానికి నిపుణులు ఉంటారన్న విషయం మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆ నిపుణులు విమానంలోనూ ప్రయాణిస్తూ తమ బ్రాండ్ల వైన్ల రుచి మారకుండా ఏం చేయాలన్న విషయమై ప్రయోగాలు జరుపుతున్నారట.