అంతరిక్షం నుంచి షేక్‌హ్యాండ్!
వాషింగ్టన్: మీ స్నేహితుడికో, పరిచయస్తుడికో షేక్‌హ్యాండ్ ఇస్తున్నారు.. ఎంత దూరంలో నిలుచుని ఉంటారు. మహా అయితే ఒకటి రెండు అడుగులు కదా. కానీ ఎక్కడో అంతరిక్షంలో 8,046 కిలోమీటర్లపై నుంచి భూమిపై ఉండేవారికి షేక్‌హ్యాండ్ ఇచ్చేస్తే..!? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఉన్న నాసా వ్యోమగామి టెర్రీ వర్ట్స్ నెదర్లాండ్స్‌లో ఉన్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) శాస్త్రవేత్త ఆండ్రె స్కీలీతో ఇలా చేయి కలిపాడు. కాకపోతే ఈ షేక్‌హ్యాండ్ ఇచ్చింది టెలీరోబోటిక్ పద్ధతిలో!
ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన జంట రోబో చేతులను వినియోగించారు. ఇందులో ఒకటి ఐఎస్‌ఎస్‌లో ఉండగా.. రెండోది ఈఎస్‌ఏ పరిశోధనశాలలో ఉంది. ఈ రెండూ పూర్తిగా అనుసంధానమై ఉంటాయి. ఒకదానితో మనం చేయికలిపితే ఏర్పడే ఒత్తిడి, కదలికలను గుర్తించి.. రెండో రోబో చేయికి షేక్‌హ్యాండ్ ఇచ్చేవారికి అదే స్థాయిలో ఒత్తిడి, కదలికలను కదిలిస్తుంది. దీంతో ఆ వ్యక్తే నేరుగా షేక్‌హ్యాండ్ ఇచ్చిన భావన కలుగుతుంది. అన్నట్లు ఇలా అంతరిక్షం నుంచి భూమిపై వారికి షేక్‌హ్యాండ్ ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం.