నిర్మానుష్యం... టూరిస్టు నగరం!
ఇస్తాంబుల్ః చారిత్రక టర్కిష్ నగరం ఇస్తాంబుల్... ఇప్పుడో దెయ్యాల దీవిలా కనిపిస్తోంది. టూరిజానికి ఎంతో ప్రసిద్ధి చెంది, ఎప్పుడూ టూరిస్టులతో కళకళలాడే నగరం... ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. షాపింగ్ చేసేందుకు సైతం టూరిస్టులు భయపడిపోతున్నారు. ఎప్పుడూ రష్ గా కనిపించే షాపులు... ఖాళీగా కనిపించడమే ఇస్తాంబుల్ అంటే జనం భయపడిపోతున్నారనేందుకు పెద్ద నిదర్శనం. పర్యాటక నగరం ఇస్తాంబుల్ విమానాశ్రయంలో గతవారం ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించడంతో ఇప్పుడా ప్రాంతంలో అడుగు పెట్టేందుకే జనం భయపడిపోతున్నారు.
టర్కీలోని అతి పెద్ద నగరం, వందల ఏళ్ళుగా టూరిజానికి ప్రసిద్ధి చెందిన ఇస్తాంబుల్... ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. కొనుగోలుదారులతో సందడిచేసే పర్యాటక నిలయం ఖాళీ వీధులతో దర్శనమిస్తోంది. గతవారం అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో తుపాకులు, బాంబులతో మారణహోమానికి తెగబడి ఉగ్రమూకలు నలభై మందికి పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకోవడం అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరాల్లో నాలుగో స్థానంలో ఉన్న ఇస్తాబుల్.. టర్కీలోని అతి పెద్దనగరమే కాక, సాంస్కృతిక, వాణిజ్యాలకు ప్రధాన కేంద్రం. యూరప్ ఆసియా ఖండాల మధ్య భాగంలో ఉన్న నగరంలోని పలు చారిత్రక ప్రాంతాలు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా కూడ గుర్తించబడ్డాయి.
చారిత్రక మాస్క్ లు, అద్భుతాలను తలపించే సందర్శనా స్థలాలు ఇస్తాంబుల్ నగరానికి తలమానికాలు. అటువంటి ప్రదేశం ఇప్పుడు ఉగ్రదాడుల భయోత్పాతానికి తలవంచాల్సి వస్తోంది. ఈ ఏడాది వరుసగా జరిగిన దాడులు స్థానిక ప్రజలనే కాక, టూరిస్టులనూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొనుగోలుదారులు లేక షాపులు వెలవెలబోతున్నాయి. టూరిస్ట్ జిల్లాగా పేరొందిన సుల్తానా మెట్ లోని రెస్టారెంట్లు, ఫైవ్ స్టార్ హోటళ్ళు సైతం పర్యాటకులు లేక అల్లాడుతున్నాయి. ఒకవేళ ఫైవ్ స్టార్ హోటళ్ళకు ఎవరైనా వచ్చినా.. అక్కడి పరిస్థితులే అదనుగా రూమ్స్ ధరలపై బేరాలాడుతున్నారు.
ఇస్తాంబుల్ దాడుల ఘటన స్థానిక పరిస్థితులనేకాదు, తమ జీవితాలనూ తారు మారు చేసేసిందని ఓ టూరిస్ట్ గైడ్ చెప్పడం విశేషం. ఎన్నో ఏళ్ళుగా తాను అదే వృత్థిలో ఉన్నానని, ప్రసిద్ధ పర్యాటక నగరంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని చెప్తున్నాడు. దీనికి తోడు తొమ్మిది రోజుల అంతర్జాతీయ సెలవు ప్రకటించడం.. స్థానికులు సైతం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళడంతో ఇప్పుడదో దెయ్యాల దీవిలా కనిపిస్తోందంటున్నాడు.
ఇస్తాంబుల్ లో జిహాదీల దాడి.. ఇప్పుడు టర్కీలోని టూరిస్ట్ ఇండస్త్రీనే తీవ్రంగా దెబ్బతీసిందని చెప్తున్నాడు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక్కడి వ్యాపారులు సైతం విదేశాలకు తరలిపోతామంటున్నారని చెప్తున్నాడు. అయితే ఇటువంటి ఘటనలు ఇక్కడకు మాత్రమే పరిమితం కాదని, ఇలా ఏ దేశంలోనైనా జరగవచ్చని కొందరు టూరిస్టులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పౌరులంతా ఏకమై, ప్రభుత్వాల కృషితో ఉగ్రభూతాన్ని అణచివేస్తే తప్పించి ఈ పరిస్థితులు ఏ దేశానికైనా తప్పవని చెప్తున్నారు.