కరోనా: ‘ఫుట్‌బాల్‌ ప్లేయర్లు చనిపోయే అవకాశం తక్కువ’ | Jair Bolsonaro Says Less Chance of Football Players Dying of Covid 19 | Sakshi
Sakshi News home page

కరోనా సోకినా వారు చనిపోరు: బ్రెజిల్‌ అధ్యక్షుడు

Published Fri, May 1 2020 3:17 PM | Last Updated on Fri, May 1 2020 3:22 PM

Jair Bolsonaro Says Less Chance of Football Players Dying of Covid 19 - Sakshi

బ్రెసీలియా: ‘‘ఫుట్‌బాల్‌ ఆటగాళ్లకు కరోనా సోకినా.. వారు చనిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వారు అథ్లెట్లు. శారరీక దారుఢ్యం కలిగి ఉంటారు. కాబట్టి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు నిర్వహించవచ్చు’’అని బ్రెజిల్‌ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగం కారణంగా ఎంతో మంది ఆటగాళ్లు కష్టాలు పడుతున్నారని.. వారిలో చాలా మంది తిరిగి క్రీడల్లో పాల్గొనేందుకు సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ఈవెంట్లు వాయిదా పడ్డాయి. ఇందులో భాగంగా బ్రెజిల్‌లో నిర్వహించాల్సిన ఫుట్‌బాల్‌ టోర్నమెంట్లను తాత్కాలికంగా వాయిదా వేశారు. మే ప్రారంభంలో బ్రెజీలియన్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభం కావాల్సి ఉండగా... కరోనా విస్తరిస్తున్న తరుణంలో టోర్నమెంట్‌ను పూర్తిగా రద్దు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (బ్రెజిల్‌ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు)

ఈ క్రమంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారో గురువారం రేడియో గైబాతో మాట్లాడుతూ.. ప్రేక్షకులు లేకుండా స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించే ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా తమ ఆరోగ్య శాఖా మంత్రి సూచించారని తెలిపారు. అదే విధంగా ఆటగాళ్లకు ఒకవేళ వైరస్‌ సోకినా వారి ప్రాణాలకు వచ్చిన ప్రమాదమేమీ లేదని వ్యాఖ్యానించారు. కాగా బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ కాన్ఫెడరేషన్‌ పరిస్థితులు చక్కబడిన తర్వాతే మ్యాచ్‌ నిర్వహణ గురించి ఆలోచించాలంటూ.. ఆరోగ్య శాఖ సూచనలు కోరుతూ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఇక బ్రెజిల్‌లో కరోనా మరణాలు ఆరు వేలు దాటినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సావో పౌలో ఫుట్‌బాల్‌ క్లబ్‌ డైరెక్టర్‌, 1994 ప్రపంచ కప్‌ విజేత రాయ్‌ సైతం బోల్సోనారో తీరును తప్పుబట్టారు. కరోనా సంక్షోభాన్ని కట్టడి చేయలేని అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాడు. ఇక ఆది నుంచి కరోనా ప్రభావాన్ని తక్కువగా అంచనా వేస్తూ.. ‘‘లిటిల్‌ ఫ్లూ ’’అంటూ బోల్సోనారో విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే.(‘ట్రంప్‌లాగే ఆలోచించవద్దు.. ప్రాణాలే ముఖ్యం’)

(మోదీకి కృతజ్ఞతలు తెలిపిన బ్రెజిల్‌ అధ్యక్షుడు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement