![Brazil Court Order To President Jair Bolsonaro Wear Face Mask - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/24/253.jpg.webp?itok=q5N0_vhF)
బ్రెసీలియా: దేశాధ్యక్షుడైనా, సామాన్య ప్రజలైనా కరోనాకు అందరూ సమానమే. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాల్సిందే. అయితే బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో ఈ మధ్య మాస్కు వాడటం లేదట. ప్రజలతో కలిసి ర్యాలీ తీస్తున్న సమయంలోనూ మాస్కు ధరించనేలేదట. ఈయన వ్యవహారంతో స్థానిక కోర్టుకు చిర్రెత్తుకొచ్చింది. దేశాధ్యక్షుడైనా మాస్కు ధరించాల్సిందేనని మంగళవారం స్పష్టం చేసింది. పబ్లిక్ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు మాస్కు వాడాలని బొల్సనారోని కోర్టు ఆదేశించింది. లేని పక్షంలో రెండు వేల రియాలు(రూ.29 వేలు) జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. (బ్రెజిల్ బేజార్)
కాగా గత వారం తన పదవికి రాజీనామా చేసిన బ్రెజిల్ విద్యాశాఖ మంత్రి మాస్కు ధరించనందుకు రెండు వేల రియాల ఫైన్ కట్టిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్, భౌతిక దూరం వంటి చర్యల్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ జెయిర్ బొల్సనారో కరోనాను తక్కువ అంచనా వేయడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించిందని కొన్ని రాష్ట్రాల గవర్నర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఒక్క మంగళవారం నాడే ఆ దేశంలో 1374 మందిని కరోనా పొట్టన పెట్టుకోగా 39,436 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు బ్రెజిల్‌లో కరోనాతో 52 వేల మంది మరణించారు. 1.1 మిలియన్‌కు పైగా జనాభా కరోనా బారిన పడ్డారు. (డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలగుతాం: బోల్సోనారో)
Comments
Please login to add a commentAdd a comment