బ్రెసీలియా: లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్‌పై కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 1179 మంది కరోనాతో మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 17,971కి చేరినట్లు పేర్కొంది. అదే విధంగా మంగళవారం నాడు కొత్తగా 17,408 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని... దీంతో మొత్తం కరోనా సోకిన బాధితుల సంఖ్య 2,71,628కి చేరుకుందని తెలిపింది. కాగా బ్రెజిల్‌లో ఒక్కరోజే వెయ్యికి పైగా కరోనా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి విస్తృతమవుతున్న కారణంగా మరిన్ని చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో అతి తక్కువ సంఖ్యలో కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తున్న కారణంగా.. కేసుల సంఖ్య, మరణాల సంఖ్య 15 రెట్లు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.(బ్రెజిల్ ప్రయాణాలపై నిషేధం: ట్రంప్)
కాగా గత మూడు రోజులుగా బ్రెజిల్‌లో మహమ్మారి తీవ్రత ఉధృతమవుతోంది. ఈ క్రమంలో అత్యధిక కేసులు నమోదైన జాబితాలో బ్రిటన్, స్పెయిన్, ఇటలీని అధిగమించి బ్రెజిల్ మూడో స్థానానికి చేరింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రయాణాలపై నిషేధం విధించే ఆలోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉండగా.. బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకై ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. (కరోనా: ఫ్రాన్స్‌ను దాటేసిన బ్రెజిల్)
అదే విధంగా.. లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన బ్రెజిల్‌ను తిరిగి పూర్వస్థితికి తీసుకురావడానికి కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో 27 రాష్ట్ర ప్రభుత్వాలు, అధ్యక్షుడి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా... కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో యాంటీ- మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉపయోగం, కోవిడ్-19 చికిత్సలో పాటించాల్సిన నూతన ప్రొటోకాల్ గురించి తమ ఆరోగ్యశాఖా మంత్రి వివరాలు వెల్లడిస్తారని బోల్సోనారో ప్రకటించారు.(కరోనా సోకినా వారు చనిపోరు: బ్రెజిల్ అధ్యక్షుడు)
Comments
Please login to add a commentAdd a comment