టోక్యో : జపాన్‌లో మహిళల వేషధారణపై పలు సంస్థలు విధిస్తున్న ఆంక్షలు దుమారం రేపుతున్నాయి. పని ప్రదేశాల్లో మహిళలు కళ్లజోడు ధరించి విధుల్లోకి రావొద్దని, బూట్లకు బదులు ఎత్తయిన హైహీల్స్ ధరించాలని నిబంధనలు పెట్టాయి. కళ్లజోడుతో మహిళ సిబ్బంది విధుల్లో ఉంటే వారి మేకప్‌ను అవి డామినేట్ చేస్తాయని రెస్టారెంట్ నిర్వాహకులు అంటుండగా.. భద్రత కోసమే మహిళా సిబ్బందికి కళ్లజోడు పెట్టుకోవద్దని ఆంక్షలు విధించామని ఎయిర్‌లైన్స్ సంస్థలు చెప్తున్నాయి.
ఈ ఆంక్షలపై జపాన్ వ్యాప్తంగా మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పురుషులకు ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా తమపైనే వివక్ష చూపుతున్నారని, అలాంటప్పుడు కళ్లజోళ్లు అమ్మడం నిషేదించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.‘కళ్లజోడు నిషేదించబడింది’అనే హ్యాష్‌టాగ్‌తో ట్రోలింగ్ మొదలు పెట్టారు. ‘కళ్లజోడుతో హాట్‌గా కనిపించడం కుదరదు, బాస్‌కు నచ్చదు. అందుకే కాబోలు ఈ దిక్కుమాలిన ఆంక్షలు’ అని మహిళలు తిట్టిపోస్తున్నారు.
గంటల తరబడి హైహీల్స్ వేసుకుంటే పని చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందని, కాళ్లు ఎర్రగా వాచిపోయి రక్తం వచ్చిన సందర్బాలూ ఉన్నాయని పలువురు మహిళా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదిమాత్రమే కాకుండా.. హైహీల్స్‌తో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారని వెల్లడించారు. హైహీల్స్‌తో నరకాన్ని చూస్తున్నామని పేర్కొంటూ.. #KuToo ఉద్యమాన్ని లేవనెత్తారు. మీటూ ఉద్యమం స్ఫూర్తిగానే కూటూ వచ్చిందని ఇషిక్వారా మహిళా ఉద్యోగిని వెల్లడించారు. జపనీస్‌లో కూటూ అంటే బాధ అని అర్థం. జపాన్‌లో పాఠశాల విద్యార్థినులపై కూడా ఆంక్షలు విధించడం గమనార్హం. నల్లని జట్టుతో.. వైవిధ్యమైన జడతో విద్యార్థినులు స్కూల్‌కు రావాలని ఆంక్షలు పెట్టడం దారుణం.
Comments
Please login to add a commentAdd a comment