
ఆ యాక్సిడెంట్ చూస్తే షాక్.. వైరల్ వీడియో
వాషింగ్టన్: వాహనాలు బోల్తాపడి పల్టీల మీద పల్టీలు కొడితే అందులో ఉన్న వారికి తీవ్రగాయాలు కావడం, కొన్ని సందర్భాలలో చనిపోవడం జరుగుతుంటుంది. కానీ, అతివేగంతో వెళ్తున్న ఓ జీపు ప్రమాదానికి గురై పల్టీలు కొట్టగా అది నడుపుతున్న వ్యక్తి సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పైగా జీపు ఎలా ఉందో చూసేందుకు వెంటనే ఎంచక్కా పరుగులు పెట్టాడు. ఈ ఘటన అమెరికాలోని అలబామాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఏజే కెల్విన్ అనే వ్యక్తి తన కారులో డ్యాష్ క్యామ్‌ను అమర్చుకున్నాడు. అలబామాలో అంతర్రాష్ట్ర రహదారి 65పై కారులో ప్రయాణిస్తున్నాడు. ఇంతలో తెలుపురంగు జీపు అతివేగంగా రహదారిపై దూసుకెళ్తోంది. ముందు వెళ్తున్న కారును జీపు డ్రైవర్ ఓవర్ టేక్ చేయబోయి ఢీకొట్టాడు. క్షణాల్లో జీపు రోడ్డుపై బోల్తాపడి గాల్లో పల్టీలు కొడుతూ కొద్దిదూరం వెళ్లి ఆగింది. ఈ క్రమంలో జీపు నుంచి డ్రైవర్ రోడ్డుపై పడిపోయాడు. వెంటనే లేచి తన జీపు ఎలా ఉందో చూసుకునేందుకు వేగంగా కదలడం.. ప్రమాదాన్ని చూసిన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రమాదానికి గురైన కారు డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు.
'నిజంగా ఇది అద్భుతమని చెప్పవచ్చు. సీటు బెల్టు ధరించవద్దని నేను చెప్పడం లేదు. అయితే జీపు నడిపిన వ్యక్తి మాత్రం సీటు బెల్టు పెట్టుకోనందుకే ప్రాణాలతో బయటపడ్డాడన్నది వాస్తవం. కారు నడిపిన వ్యక్తి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నాడు. నా కెమెరాలో ఈ సీన్ చూస్తే మాత్రం ఎవరైనా అవాక్కవుతారు' అని ప్రత్యక్షసాక్షి ఏజే కెల్విన్ చెప్పుకొచ్చాడు.