డొనాల్డ్ ట్రంప్, జిమ్ మేటిస్
వాషింగ్టన్: రక్షణ మంత్రి జిమ్ మేటిస్ పదవి నుంచి వైదొలిగే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సీబీఎస్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం తెలిపారు. దీంతో మంత్రివర్గంలో మరికొన్ని మార్పులు సంభవించనున్నాయనే అంచనాలు ఊపందుకున్నాయి. ‘నిజం చెప్పాలంటే జనరల్ మేటిస్ ఒక విధమైన డెమోక్రాట్(ప్రతిపాక్ష పార్టీ వ్యక్తి) అని నేననుకుంటున్నాను. కానీ, ఆయన మంచి వాడు. మేం కలిసి బాగా పనిచేశాం. ఆయన వెళ్లిపోవచ్చు. అంటే, ఎప్పుడో ఒకప్పుడు, అందరి లాగానే’ అని అన్నారు.
రక్షణ మంత్రిగా మేటిస్ మరికొద్ది రోజులపాటు మాత్రమే కొనసాగే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘మనకు గొప్ప కేబినెట్ ఉంది. అందులోని కొందరితో నాకు సంతృప్తి లేదు. కొందరితో సంతోషం లేదు. మరికొందరి వల్ల అంచనాకు మించిన సంతృప్తి ఉంది’ అని తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌తో నేరుగా వివాదం తలెత్తకుండా క్యాబినెట్‌లో స్వతంత్రంగా వ్యవహరించే వ్యక్తిగా మేటిస్‌కు పేరుంది. మిత్ర దేశాలతో ట్రంప్ తీవ్ర వైఖరికి అడ్డుకట్ట వేసి, సామరస్యంగా వ్యవహారం నెరుపుతారని భావిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment