Jim Mattis
-
ట్రంప్‌పై విరుచుకుపడ్డ డిఫెన్స్ మాజీ చీఫ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ డిఫెన్స్ మాజీ చీఫ్ జిమ్ మాటిస్ విరుచుకుపడ్డారు. అమెరికన్లను విభజించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని, నిరసనలతో దేశం అట్టుడుకుతున్న క్రమంలో పరిణితికలిగిన నాయకత్వ పటిమను ప్రదర్శించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. అమెరికన్లను సమైక్యపరిచేందుకు ప్రయత్నించని తొలి అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ అని అగ్రరాజ్య అధ్యక్షుడి తీరుపై మండిపడ్డారు. పౌరులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించకపోగా ట్రంప్ తమను విడదీస్తున్నారని మాటిస్ ఆందోళన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా పరిణితి కలిగిన నాయకత్వం కొరవడిన పరిణామాలను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని పేర్కొన్నారు. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికా ఆందోళనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సాగుతున్న వర్ణవివక్ష ర్యాలీలకు మద్దతు ప్రకటించిన పెంటగాన్ మాజీ చీఫ్ మాటిస్ సిరియాలో అమెరికన్ దళాల ఉపసంహరణపై ట్రంప్ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ 2018 డిసెంబర్లో తన పదవికి రాజీనామా చేశారు. చదవండి: జార్జ్ ఫ్లాయిడ్ నిరసనలు.. ట్రంప్‌కు షాక్ -
ట్రంప్‌నకు రక్షణ మంత్రి షాక్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాగ విధానంతో విసుగు చెందిన ఆ దేశ రక్షణ మంత్రి జిమ్ మాటిస్ తన పదవికి రాజీనామా చేశారు. సలహాదారుల సూచనను పెడచెవినపెడుతూ సిరియా నుంచి అమెరికా దళాలను ఉపసంహరించాలని ట్రంప్ నిర్ణయించిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. ట్రంప్‌తో మాటిస్ ముఖాముఖి భేటీ అనంతరం ఆయనతో విభేదాలు పొడసూపిన నేపథ్యంలో రాజీనామా చేయనున్నట్టు మాటిస్ ప్రకటించారని వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ట్రంప్ ఒత్తడి కారణంగానే మాటిస్ రక్షణ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్నారనే వార్తలు నిరాధారమైనవని అమెరికన్ అధికారి స్పష్టం చేశారు.సిరియాపై ట్రంప్ నిర్ణయంతో విభేదించినందునే మాటిస్ వైదొలగారని మరికొందరు చెబుతున్నారు. మాటిస్ నిష్క్రమణ అమెరికా సైనిక దళాలు, భాగస్వామ్య పక్షాలకు షాకింగ్‌గా భావిస్తున్నారు. తదుపరి రక్షణ మంత్రి ట్రంప్ విధానాలతో ఏకీభవించి నాటో సహా సైనిక ఒప్పందాలను గౌరవిస్తారా అనే ఆందోళన సైనిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ట్రంప్ ఎంచుకున్న అమెరికా ఫస్ట్ అజెండాతో కూడా మాటిస్ విభేదించారు. -
మంత్రి మేటిస్ వైదొలగొచ్చు: ట్రంప్
వాషింగ్టన్: రక్షణ మంత్రి జిమ్ మేటిస్ పదవి నుంచి వైదొలిగే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సీబీఎస్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం తెలిపారు. దీంతో మంత్రివర్గంలో మరికొన్ని మార్పులు సంభవించనున్నాయనే అంచనాలు ఊపందుకున్నాయి. ‘నిజం చెప్పాలంటే జనరల్ మేటిస్ ఒక విధమైన డెమోక్రాట్(ప్రతిపాక్ష పార్టీ వ్యక్తి) అని నేననుకుంటున్నాను. కానీ, ఆయన మంచి వాడు. మేం కలిసి బాగా పనిచేశాం. ఆయన వెళ్లిపోవచ్చు. అంటే, ఎప్పుడో ఒకప్పుడు, అందరి లాగానే’ అని అన్నారు. రక్షణ మంత్రిగా మేటిస్ మరికొద్ది రోజులపాటు మాత్రమే కొనసాగే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘మనకు గొప్ప కేబినెట్ ఉంది. అందులోని కొందరితో నాకు సంతృప్తి లేదు. కొందరితో సంతోషం లేదు. మరికొందరి వల్ల అంచనాకు మించిన సంతృప్తి ఉంది’ అని తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌తో నేరుగా వివాదం తలెత్తకుండా క్యాబినెట్లో స్వతంత్రంగా వ్యవహరించే వ్యక్తిగా మేటిస్కు పేరుంది. మిత్ర దేశాలతో ట్రంప్ తీవ్ర వైఖరికి అడ్డుకట్ట వేసి, సామరస్యంగా వ్యవహారం నెరుపుతారని భావిస్తుంటారు. -
'చైనా, రష్యా బెదిరిస్తున్నాయి.. యుద్ధానికి సిద్ధం కండి'
వాషింగ్టన్ : యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మట్టిస్ తమ బలగానికి స్పష్టం చేశారు. గత కొద్ది కాలంగా రష్యా, చైనా నుంచి వరుసగా బెదిరింపులు వస్తున్నాయని వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కొత్త రక్షణ వ్యూహాన్ని సిద్ధం చేయాలని పెంటగాన్ భావిస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'చైనా, రష్యావంటి పలు దేశాల నుంచి బెదిరింపులను మనం కొంత కాలంగా ఎదుర్కొంటున్నాము. ఇటీవల అమెరికా సైనిక సామర్థ్యంలో మార్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇప్పటికీ మన సైన్యం బలమైనదే. గగనతలంలోనూ, ఉపరితలంలోనూ, అంతరిక్షంలోనూ, సైబర్ స్పేస్లోను మన ఆదిపత్యం ఉన్నప్పటికీ అది నానాటికీ కొంత తగ్గుతూ వస్తోంది. గత కొంత కాలంగా సరైన బడ్జెట్ కేటాయింపులు చేయని కారణంగా అమెరికా సైన్యం ఇబ్బంది పడుతోందని డోనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందుకే మరోసారి మొత్తం సైనిక శక్తిని పటిష్టం చేసి పునరుత్తేజం చేయాల్సిన అవసరం ఉంది' అని ఆయన అన్నారు. -
పాక్‌కు అమెరికా వరుస షాక్‌లు
వాషింగ్టన్ : పాకిస్తాన్ ఉగ్రవాదులకు అందిస్తున్న సహకారాన్ని నిలిపేస్తేనే అమెరికా, నాటో దళాలు సహాయం చేస్తాయని అమెరికా స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి ఊతమిచ్చే విధానాలను మానుకుంటేనే పాకిస్తాన్‌కు అంతార్జాతీయ సహకారం ఉంటుందని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిస్ స్పష్టం చేశారు. బ్రస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో జరిగిన సదస్సులో మాటిస్ పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సులో ప్రధానంగా దక్షిణాసియాలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రాంతీయ వాదం, పునరేకీకరణ వంటి అంశాలపై చర్చ జరిగింది. దక్షిణాసియాలో నాటో దళాలు ముందుకు సాగాలన్నా, ఉగ్రవాదంపై పోరులో విజయం సాధించాలన్న భారత్‌తో ఉపయుక్తమైన సంబంధాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్లో అయినా, అఫ్ఘనిస్తాన్లోనైనా ఉగ్రవాద స్థావరాలు, కేంద్రాలు ఎక్కడున్నా వాటిని నాటో దళాలు ధ్వంసం చేస్తాయని ఆయన తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌ను అమెరికా నమ్మడం లేదని ఆయన నాటోకు తెలిపారు. -
ఇదే ఆఖరి అవకాశం
వాషింగ్టన్ : కొంతకాలంగా అమెరికా-పాకిస్తాన్ మధ్య సంబంధాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. అందులోనూ చైనాకు పాకిస్తాన్ దగ్గరయినప్పటినుంచి పరిణామాల్లో మర్పులు వేగంగా సంభవిస్తున్నాయి. తాజాగా ఉగ్రవాదులకు ఐఎస్ఐ, పాక్ సైన్యం సహకారమందిస్తోందని అమెరికా ఉన్నతాధికారి రెక్స్ టెల్లర్సన్ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో పరిస్థితులు మరింత దిగజారాయి. ట్రంప్ న్యూ ఆఫ్ఘన్ పాలసీని పాక్ వ్యతిరేకించడంతో తాజాగా అమెరికా చివరి తన చివరి సందేశాన్ని పాక్‌కు పంపేందుకు రెడీ అవుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక, సైనిక, ఆయుధ సహకారాలను అందించడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాక ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షిత అడ్డగా మారిందని.. ఇది ఇరు దేశాల సంబంధాలకు మంచిది కాదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు అమెరికా రక్షణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి ట్రంప్ సందేశంతో వచ్చేవారంలో పాకిస్తాన్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల విషయంలో పాకిస్తాన్‌కు ట్రంప్ ఇస్తున్న ఆఖరి అవకాశంగా అమెరికా రక్షణ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జేమ్స్ మాటిస్ పర్యటన తరువాత పాకిస్తాన్-అమెరికా సంబంధాల్లో కీలక మార్పులు సంభవించబోతున్నాయని రక్షణ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రక్షణ, ఆర్థిక సహకారాలపై ప్రభావం చూపుతుందని పెంటగాన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. లాడెన్‌కు పాకిస్తాన్ అధికార వర్గాలే రక్షణ కల్పించాయిన పెంటగాన్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఇది క్షమించరాని నేరంగానే ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోందని పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా అమెరికాలోని గన్ లాబీకే ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న పాకిస్తాన్ విదేశాంగ శాఖమంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపైనా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని తాలిబన్లకు పాకిస్తాన్‌లోని ఐఎస్ఐ, సైనికులు, ఉగ్రవాదులు సహాయం అందిస్తున్న విషయం ఇప్పటికే తేటతెల్లం అయిందని అమెరికా స్పష్టం చేసింది. ముఖ్యంగా లష్కరే తోయిబాతో ఐఎస్ఐ అంటకాగుతోందని అమెరికా రక్షణ శాఖ వర్గాలు మండిపడ్డాయి. -
'బాగ్దాదీ చావలే.. మేం చంపాకే నమ్ముతాం'
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ ఇప్పటికీ బతికే ఉన్నట్లు భావిస్తున్నామని అమెరికా తెలిపింది. ఇటీవల తాము జరిపిన వైమానిక దాడుల్లో బాగ్దాదీ చనిపోయినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని సిరియాకు చెందిన హక్కుల సంస్థ కూడా పేర్కొంది. అయితే, తాను మాత్రం బాగ్దాదీ హతమయ్యాడని అనుకోవడం లేదని, వైమానిక దాడుల్లో అతడి ఎలాంటి హానీ జరగలేదని భావిస్తున్నానని అమెరికా ప్రధాన రక్షణ స్థావరం పెంటగాన్ చీఫ్ జిమ్ మాట్టిస్ అన్నారు. 'బాగ్దాదీ బతికే ఉన్నాడని నేను అనుకుంటున్నాను. తాము చంపేసినప్పుడు మాత్రమే అతడు చనిపోయాడని మేం నమ్ముతాం' అని చెప్పారు. అమెరికా బాగ్దాదీ తలపై దాదాపు 25 మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది.