
డొనాల్డ్ ట్రంప్ పరిణితిలేని నాయకుడని మండిపడ్డ డిఫెన్స్ మాజీ చీఫ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ డిఫెన్స్ మాజీ చీఫ్ జిమ్ మాటిస్ విరుచుకుపడ్డారు. అమెరికన్లను విభజించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని, నిరసనలతో దేశం అట్టుడుకుతున్న క్రమంలో పరిణితికలిగిన నాయకత్వ పటిమను ప్రదర్శించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. అమెరికన్లను సమైక్యపరిచేందుకు ప్రయత్నించని తొలి అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ అని అగ్రరాజ్య అధ్యక్షుడి తీరుపై మండిపడ్డారు.
పౌరులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించకపోగా ట్రంప్ తమను విడదీస్తున్నారని మాటిస్ ఆందోళన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా పరిణితి కలిగిన నాయకత్వం కొరవడిన పరిణామాలను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని పేర్కొన్నారు. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికా ఆందోళనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సాగుతున్న వర్ణవివక్ష ర్యాలీలకు మద్దతు ప్రకటించిన పెంటగాన్ మాజీ చీఫ్ మాటిస్ సిరియాలో అమెరికన్ దళాల ఉపసంహరణపై ట్రంప్ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ 2018 డిసెంబర్‌లో తన పదవికి రాజీనామా చేశారు.