కూతురు ఇవాంకతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫొటో)
వాషింగ్టన్ : ఎవరూ ఊహించని రీతిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని అధిష్టానించిన డొనాల్డ్ ట్రంప్.. తాను అధ్యక్షుడు కావాలని ఎన్నడూ అనుకోలేదట. అంతేకాదు ట్రంప్ ఎన్నికల్లో గెలిచారనే విషయం తెలియగానే మెలనియా ఏడ్చేశారట.
అధ్యక్షుడిగా ట్రంప్ ఏడాది పాలనపై జర్నలిస్టు మైఖెల్ వూల్ఫ్ సంచలన విషయాలు వెల్లడించారు. ‘ఫైర్ అండ్ ఫ్యూరీ : ఇన్‌సైడ్ ది ట్రంప్ వైట్ హౌస్’ పేరుతో ట్రంప్ పాలనపై మైఖెల్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఎన్నికల్లో గెలుపు అనంతరం ట్రంప్‌ను టీవీలో చూసిన మైఖెల్‌కు ఆయనో దెయ్యంలా కనిపించారట.
ప్రపంచంలోనే ప్రముఖ వ్యక్తి కావాలన్నది తన కలని.. అధ్యక్షుడిగా గెలవాలనే ఉద్దేశం తనకు ఏ మాత్రం కాదని ట్రంప్ తన స్నేహితుడైన సామ్‌తో చెప్పారని మైఖెల్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. బుల్లితెర రంగంలో రాణించాలి అంటే అధ్యక్ష పదవికి పోటీ చేయాల్సిందేనని ట్రంప్‌కు ఆయన స్నేహితుడు రోజర్ చెప్పినట్లు వెల్లడించారు.
రోజర్ మాటను అనుసరించే ట్రంప్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. ట్రంపే తనను ఈ పుస్తకం రాసేందుకు ప్రోత్సహించారని మైఖెల్ పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇవాంక ట్రంప్ వచ్చే ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతానని భర్త కుష్నెర్‌తో చెప్పినట్లు తెలిపారు.
వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన అనంతరం ఆ వాతావరణానికి అలవాటు పడేందుకు ట్రంప్ చాలా ఇబ్బంది పడ్డారని మైఖెల్ తన పుస్తకంలో పేర్కొన్నారు. తన వస్తువులను ఎవరూ ముట్టుకోకూడదని సిబ్బందికి కఠిన నిబంధనలు విధించారని తెలిపారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్‌కు ప్రాణ భయం పట్టుకుందని చెప్పారు. విష ప్రయోగం చేసి తనను హతమారుస్తారనే భయంతో ఎక్కువగా మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌లనే తినేవారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment