డెల్వుడ్లో ఆందోళనకారులు కార్లను తగులబెట్టిన దృశ్యం
న్యూయార్క్: ఆందోళనలతో అమెరికా అట్టుడుకుతోంది. ఈ ఏడాది ఆగస్ట్ 9న మైఖేల్ బ్రౌన్ అనే 18 ఏళ్ల నల్లజాతీయుడిని కాల్చి చంపిన ఘటనలో ఫెర్గుసన్ పోలీసు అధికారి డారెన్ విల్సన్ తప్పేమీ లేదని అమెరికన్ గ్రాండ్ జూరీ తేల్చడంతో ఒక్కసారిగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి పలు భవనాలకు నిప్పుపెట్టారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. లాస్ ఏంజిల్స్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, ఓక్‌లాండ్, డెల్వుడ్, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో ఆందోళనలు ఊపందుకున్నాయి. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ప్రజలు సంయమనం పాటించాలని అధ్యక్షుడు ఒబామా విజ్ఞప్తి చేశారు.
అమెరికాలో బొమ్మ తుపాకి కలిగి ఉన్న 12 ఏళ్ల బాలుడు తమిర్ రైస్‌ను క్లైవ్‌లాండ్ పోలీసులు ఈ నెల 22 శనివారం కాల్చారు. 23న మృతి చెందాడు. అసలు తుపాకీ అనుకొని కాల్చామని ఆ పోలీసులు తాపీగా చెప్పారు. పోలీసుల అత్యుత్సాహంపై అగ్రరాజ్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమిర్ రైస్‌ను పోలీసులు కాల్చి చంపడం కలకలం రేపుతోంది. గ్రౌండ్‌లో తమిర్ జనాల వైపు బొమ్మ తుపాకీని చూపిస్తూ సరదగా ఆడుకుంటూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులెవరో పోలీసులకు చెందిన 911 నెంబర్‌కు ఫోన్ చేశారు. గ్రౌండ్‌కు వచ్చిన పోలీసులు బాలుడు తన ప్యాంట్‌లో నుంచి మాటి మాటికీ గన్‌తీసి పెడుతుండటం చూశారు. అయితే అతడి చేతిలో ఉన్న గన్ ఒరిజినలా, డూప్లికేటా అన్నది మాత్రం ఆలోచించలేదు. వచ్చీ రాగానే తమిర్‌ను లొంగిపొమ్మంటూ హెచ్చరించారు. చేతులు ఎత్తాలని హెచ్చరించినా వినిపించుకోవడం లేదంటూ కాల్పులు జరిపారు. గాయాలతో విలవిలలాడుతూ కిందపడిపోయిన తమిర్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు ఆదివారం చనిపోయాడు.
బాలుడి మృతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కలకలం రేపిన ఈ ఘటన అగ్రరాజ్యంలో అభద్రతా భావాన్ని వెల్లడిస్తోంది.
**