Michael Brown
-
ఆందోళనలతో అట్టుడుకుతోన్న అమెరికా!
న్యూయార్క్: ఆందోళనలతో అమెరికా అట్టుడుకుతోంది. ఈ ఏడాది ఆగస్ట్ 9న మైఖేల్ బ్రౌన్ అనే 18 ఏళ్ల నల్లజాతీయుడిని కాల్చి చంపిన ఘటనలో ఫెర్గుసన్ పోలీసు అధికారి డారెన్ విల్సన్ తప్పేమీ లేదని అమెరికన్ గ్రాండ్ జూరీ తేల్చడంతో ఒక్కసారిగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి పలు భవనాలకు నిప్పుపెట్టారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. లాస్ ఏంజిల్స్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, ఓక్లాండ్, డెల్వుడ్, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో ఆందోళనలు ఊపందుకున్నాయి. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ప్రజలు సంయమనం పాటించాలని అధ్యక్షుడు ఒబామా విజ్ఞప్తి చేశారు. అమెరికాలో బొమ్మ తుపాకి కలిగి ఉన్న 12 ఏళ్ల బాలుడు తమిర్ రైస్‌ను క్లైవ్లాండ్ పోలీసులు ఈ నెల 22 శనివారం కాల్చారు. 23న మృతి చెందాడు. అసలు తుపాకీ అనుకొని కాల్చామని ఆ పోలీసులు తాపీగా చెప్పారు. పోలీసుల అత్యుత్సాహంపై అగ్రరాజ్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమిర్ రైస్‌ను పోలీసులు కాల్చి చంపడం కలకలం రేపుతోంది. గ్రౌండ్లో తమిర్ జనాల వైపు బొమ్మ తుపాకీని చూపిస్తూ సరదగా ఆడుకుంటూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులెవరో పోలీసులకు చెందిన 911 నెంబర్‌కు ఫోన్ చేశారు. గ్రౌండ్‌కు వచ్చిన పోలీసులు బాలుడు తన ప్యాంట్లో నుంచి మాటి మాటికీ గన్‌తీసి పెడుతుండటం చూశారు. అయితే అతడి చేతిలో ఉన్న గన్ ఒరిజినలా, డూప్లికేటా అన్నది మాత్రం ఆలోచించలేదు. వచ్చీ రాగానే తమిర్‌ను లొంగిపొమ్మంటూ హెచ్చరించారు. చేతులు ఎత్తాలని హెచ్చరించినా వినిపించుకోవడం లేదంటూ కాల్పులు జరిపారు. గాయాలతో విలవిలలాడుతూ కిందపడిపోయిన తమిర్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు ఆదివారం చనిపోయాడు. బాలుడి మృతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కలకలం రేపిన ఈ ఘటన అగ్రరాజ్యంలో అభద్రతా భావాన్ని వెల్లడిస్తోంది. ** -
నేటి అమెరికా ‘నల్ల’ నిజం
‘‘శ్వేత జాతీయులు గౌరవించాల్సిన హక్కులేవీ ఆఫ్రికన్ అమెరికన్లకు లేవు.’’ 1857 నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రోజర్ టానీ మాటలే అమెరికాలోని శ్వేతజాతి పోలీసు అధికారులలో చాలా మందికి శిరోధార్యంగా నిలుస్తున్నాయి. కాబట్టే ఈ నెల 9న పద్దెనిమిదేళ్ల మైఖేల్ బ్రౌన్ పోలీసు తూటాలకు బలైపోయాడు. ఫుట్‌పాత్ మీద కాక రోడ్డు మీద నడవడం బ్రౌన్ చేసిన తప్పు. బ్రౌన్ హత్యకు నిరసనగా ఫెర్గ్యూసన్ భగ్గున మండటంతో పోలీసులు హడావిడిగా ఒక అతుకుల బొంత కథనాన్ని చెప్పారు. దాని ప్రకారం బ్రౌన్కు ఒక దొంగతనంతో సంబంధం ఉంది. బ్రౌన్ దొంగే అయినా కాల్చి చంపేసే హక్కు ఏ పోలీసు అధికారికి లేదు. పైగా ‘దొంగ’ చేతులు రెండూ తలపై పెట్టి లొంగిపోవడానికి సిద్ధంగా ఉండగా కాల్చాల్సిన అవసరం అసలే లేదు. ఎంత కరడుగట్టిన నేరస్తుడైనా పోలీసు కాల్పులకు కుప్పకూలి గంటల తరబడి అక్కడే పడి ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా అవన్నీ జరిగాయంటే బ్రౌన్ నల్ల జాతి అమెరికన్ కాబట్టే. ‘‘ప్రపంచంలోని అత్యంత విస్ఫోటకరమైన, ప్రమాదకరమైన చెడుగు జాత్యహంకారమే. అది ఒక్కటిగా బతకలేని మనుషుల అశక్తత. ప్రత్యేకించి పాశ్చాత్య ప్రపంచపు అశక్తత’’ అని ఎలుగెత్తి చాటిన మాల్కమ్ ఎక్స్ హత్యకు గురై అర్ధ శతాబ్ది గడుస్తోంది. అయినా ఆ అశక్తత అమెరికాను వీడలేదు. కాబట్టే బ్రౌన్ పోలీసు హత్యను, దానికి వెనుక ఉన్న జాత్యహంకారాన్ని ప్రశ్నించిన 90 ఏళ్ల పండుటాకు హెడీ ఎప్స్టీన్ చేతులకు బేడీలు, కారాగారవాసం. హెడీలాంటి వృద్ధుల నుండి బాష్ప వాయు గోళాలకు, రబ్బరు బుల్లెట్లకు క్షతగాత్రులవుతున్న ఎనిమిదేళ్ల పసివాళ్ల వరకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారే. నిరసనకారులు పోలీసులపై మాల్టోవ్ కాక్టెయిల్స్ (పెట్రోల్ బాంబులు) ప్రయోగించడం పోలీసు కట్టుకథ. సాక్ష్యం, పోలీసు లాఠీ దెబ్బల రుచిని చూసిన మీడియా ప్రతినిధులే. నిరసనకారులు ఘర్షణలకు దిగేలా రెచ్చగొడుతున్న పోలీసులే వారిని ‘‘పథకం ప్రకారం, సంఘటితంగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న గుంపులు’’గా చిత్రీకరిస్తున్నారు. అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధించి, నేషనల్ గార్డు సాయుధ పారా మిలిటరీ బలగాలను, సైనిక సాయుధ శకటాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తెస్తామంటున్నారు. ‘ఫెర్గ్యూసన్’ ఒక విడి ఘటన కాదు. ఒక ధోరణిగానే నల్లజాతి పౌరులపై శ్వేతజాతి పోలీసుల, పౌర రక్షణ దళాల హత్యాకాండ పెచ్చుపెరిగిపోతోంది. 2006-12 మధ్య వారానికి సగటున ఇద్దరు నల్లజాతి అమెరికన్లు శ్వేతజాతి పోలీసుల కాల్పుల్లో మరణించారు. జూలై 17న జరిగిన 16 ఏళ్ల ఎరిక్ గార్నర్ హత్య కూడా దేశవ్యాప్తంగా ఆందోళనను రేకెత్తించింది. బ్రౌన్ హత్య తర్వాత రెండు రోజులకే కాలిఫోర్నియాలో మానసిక వికలాంగుడైన మరో నల్లజాతీయుడు పోలీసు కాల్పులకు బలైపోయాడు. నల్లజాతి అమెరికన్లలో నేరస్వభావం పెరిగిపోతోందంటూ పలువురు రిపబ్లికన్ నేతలు అతి తరచుగా శ్వేతజాత్యహంకార పోలీసు వ్యవస్థకు వత్తాసు పలకడం పరిపాటిగా మారింది. కానీ ఏటా దేశంలో హత్యలకు గురయ్యే వారిలో 50 శాతానికిపైగా... జనాభాలో 12 శాతంగా ఉన్న నల్ల జాతీయులే. పోలీసు వ్యవస్థేకాదు, న్యాయవ్యవస్థ సైతం జాత్యహంకార పోకడలను నిస్సిగ్గుగా ప్రదర్శిస్తుండటం విశేషం. ఏ నేరానికైనా శ్వేతజాతీయులకంటే నల్లజాతి వారి విషయంలో శిక్ష పడే అవకాశం 38 శాతం ఎక్కువని జాతీయ నేరాల గణాంకాలే చెబుతున్నాయి. ‘‘ఇదంతా ఎలా మొదలైందనేది కూడా ముఖ్యమైనది, నిజమే. ఒక యువకుడు విషాదకర పరిస్థితుల్లో మరణించడం హృదయవిదారకమైనదే’’ అంటూ అమెరికా మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షుడు బరాక్ ఒబామా... దేశంలో రోజురోజుకూ ఘనీభవిస్తున్న శ్వేత జాత్యహంకార పోకడలను గుర్తించ నిరాకరించడం ఆశ్చర్యకరం. నల్లజాతి అమెరికన్లలో 88 శాతం జాతి వివక్షకు గురవుతున్నామని భావిస్తున్నట్టు ‘ప్యూ’ పరిశోధనా సంస్థ తాజా సర్వేలో తేలింది. బానిసత్వ నిర్మూలనను వ్యతిరేకించి స్వతంత్రం ప్రకటించుకున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన ముస్సోరీ నేటికీ శ్వేతజాత్యహంకార పోకడలకు మారు పేరు. పైగా ఫెర్గ్యూసన్‌లో 68 శాతం నల్లజాతీయులు కాగా అక్కడి పోలీసు అధికారుల్లో ముగ్గురంటే ముగ్గురే నల్లజాతీయులు! దీనికి తోడు నల్లజాతివారంటేనే నేరస్తులుగా ముద్రవేయడం, కేసుల్లో ఇరికించడం పోలీసులకు, శిక్షించడం న్యాయమూర్తులకు అలవాటుగా మారింది. పైగా పేదరికం, నిరుద్యోగం, విద్యావకాశాల లేమి వంటి సమస్యలకు నేరగ్రస్తతకు మధ్య ఉన్న సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుంటే నల్లజాతి వారిలో పెరిగిపోతుందంటున్న ‘నేరగ్రస్త స్వభావం’ జాతిపరమైనది కాదు జాతీయ విషాదం. అది అన్ని జాతుల ప్రజలను పట్టి పీడిస్తున్న అర్థిక మాంద్యపు ప్రభావం. సరిగ్గా అదే జాత్యహంకార మితవాద శక్తులు బలపడటానికి కారణమౌతోంది. నల్లజాతి వారిలో సర్వత్రా అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ‘‘శ్వేత జాతీయులు మన కోసం నిర్మిం చిన మురికి కూపాల్లో మనం నిత్యం బతుకు పోరాటం చేస్తూ గడిపాలని శాసించారే తప్ప అంతకు మించిన పెద్ద లక్ష్యాల సాధన కోసం కాదు.’’ నాటి మాల్కమ్ మాటలే నేటి అమెరికా సత్యంగా నిలిచిన ఫలితమే ముస్సోరీలోని దావానలం. ఆయనే అన్నట్టు ‘‘సాధారణంగా ప్రజలు విషాదంగా ఉన్నప్పుడు ఏమీ చేయరు, ఏడుస్తారంతే. అదే ఆగ్రహానికి గురైనప్పుడు మార్పును తీసుకొస్తారు.’’ -
అమెరికాను వెంటాడుతున్న ‘కల’
ఆయన కల నెరవేరడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. నల్లజాతి జీవనంలో గుణాత్మకంగా ఎన్నో మార్పులు వచ్చా యి. అయితే వచ్చిన ఈ పరివర్తన శ్వేతజాతీయులవల్ల మాత్రం కాదు. నల్లజాతి పోరాట పటిమే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆ పోరాట స్ఫూర్తిని నల్ల జాతీయులకు ఇచ్చినవాడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ‘ఏదో ఒక రోజున నా నలుగురు పిల్లలు వారి వర్ణాన్ని బట్టి కాకుండా, వ్యక్తిత్వాలను బట్టి గుర్తించే దేశంలో నివసిస్తారని నాకో కల ఉంది...’ రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) చరిత్రాత్మక మహోపన్యాసం ‘నాకో కల ఉంది’లో (ఆగస్టు 28, 1963) వాక్యమిది. లూథర్‌కింగ్ (జనవరి 15, 1929-ఏప్రిల్ 4, 1968) స్వప్నం అమెరికాను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అమెరికా నల్లజాతి చరిత్రను మలుపుతిప్పిన ఈ మహోపన్యాసం 50వ వార్షికోత్సవం సంద ర్భంగా జరిగిన ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈ నెల 28న వాషింగ్టన్‌లోని అబ్రహాం లింకన్ స్మారక కట్టడం వద్ద చేరిన వారంతా తలవక తప్పని ఒక ఘటన సరిగ్గా అదే సమయంలో జరిగింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్ తదిత రులు ఈ సభలో మాట్లాడారు. లూథర్ ఉపన్యసించిన లింకన్ స్మారక కట్టడం సోపానాల మీద నుంచే ఒబామా కొన్ని వాస్తవాలు అంగీ కరించారు. ఆ తాజా ఘటన అమెరికాను తొలి నల్లజాతీయుడు పాలిస్తున్న వర్తమాన కాలంలో చోటుచేసుకోవడం గమనార్హం. అట్లాంటాలో ఫ్రైడ్ చికెన్‌కు ఎంతో పేరు పొందిన పాస్కల్స్ మోటర్ హోటల్లో మార్టి న్ తన ఉద్యమ సహచరులతో సమావేశాలు జరిపేవాడు. అది ఆనాటి సంగతి. ఈ నాటి సంగతి నాటి వివక్షకు సజీవ సాక్ష్యంగా నిలి చింది. మైకేల్ బ్రౌన్ కుటుంబ సభ్యులు, మి త్రులు పాతికమంది దక్షిణ కరోలినాలోని ఉత్తర చార్లెస్టన్లో ఉన్న ‘వైల్డ్ వింగ్స్ కేఫ్’కు విందు చేద్దామని వెళ్లారు. నిర్వాహకులు అనుమతించలేదు. ఈ హోటల్ కూడా చికెన్‌కు ప్రసిద్ధి. నల్లవారు ఎక్కువగా ఉండే ఈ ప్రాం తంలోని ఈ రెస్టారెంట్లో శ్వేతజాతి మహిళ ఒకరు, తాను లోపల ఉండగా నల్లజాతీయు లు ప్రవేశించడానికి వీల్లేదని చెప్పడంతో ఇది జరిగింది. అమెరికాలో జాతి వివక్షకు రెక్కలు ఇంకా తెగిపోలేదని ‘వైల్డ్ వింగ్స్ కేఫ్’ తాజా గా రుజువు చేసింది. జాతులపరంగా అమెరికాలో ద్వితీయ స్థానం నల్లజాతి అమెరికన్లదే. పశ్చిమ, మధ్య ఆఫ్రికాల నుంచి బానిసలుగా వీరిని తెచ్చుకున్నారన్నది సత్యం. 16వ శతాబ్దం నుంచి వీరు అమెరికా చరిత్రలో అంతర్భాగమైనప్పటికీ అదంతా అవమాన భారంతో నిండినదే. 20వ శతాబ్దం మధ్య వరకు అమానుషమైన దుస్థితిలో బతికారు. ఓటుహక్కు, చదువు, సమన్యాయం మొదటి నుంచి వారికి దక్కలేదు. అబ్రహాం లింకన్ హయాంలో జరిగిన ఉత్తర దక్షిణ అమెరికాల మధ్య పోరాటం, నల్లజాతీయులు అణచివేత మీద చేసిన తిరుగుబాటు. అప్పుడే బానిసత్వం పోయింది. కానీ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అహింసాయుతంగా జరిగిన పౌరహక్కుల ఉద్యమం (1955-1968)తో నల్లజాతీయుల జీవితంలో మార్పులు వచ్చాయి. ఈ ఉద్యమానికి కేంద్ర బిందువే మార్టిన్ లూథర్ కింగ్. అమెరికా రాజ్యాంగం నల్లజాతికి కల్పించిన సమన్యాయం, ఆర్థిక సమానత్వం వంటి హక్కుల సాధనకు ఆయన ఉద్యమించాడు. ఆయన ప్రసంగంలో నల్లజాతీయులు నేటికీ ఉషస్సులను దర్శిస్తారు. జాతివివక్ష లేకుండా అమెరికా బాలబాలికలంతా చెట్టపట్టాలేసుకుని, కలిసిమెలిసి జీవించాలని లూథర్‌కింగ్ ఆశయం. ఈ భావా న్నే కవితాత్మకంగా, ఉద్విగ్నంగా తన ప్రసంగంలో నిక్షిప్తం చేశాడు. 1940 వరకు నల్లవారికి తెల్లజాతీయుల విద్యాలయాలలో ప్రవేశం లేదు. 60 శాతం స్త్రీలు శ్వేతజాతీయుల ఇళ్లలో పనిమనుషులే. 1965 దాకా ఓటు హక్కు దక్కలేదు. 2000 నాటికి నల్లజాతీయులు విద్యలో పురోగమించారు. ఆర్థికస్థితి మాత్రం మెరుగుపడింది. 2010కి 45 శాతం నల్లజాతీయులు సొంత ఇళ్లు కలిగి ఉన్నారు. మొత్తం అమెరికన్లలో 67 శాతం సొంత ఇళ్లు ఉన్నవారు కనిపిస్తారు. ఇప్పుడు 85 శాతం మెట్రోపాలిటన్లలో నల్లవారికీ తెల్లవారికీ వేర్వేరు నివాస ప్రాంతాలు కనిపించవు. మార్టిన్ చూసిన అమెరికాలో తెల్ల, నల్లజాతీయుల మధ్య ప్రేమలూ పెళ్లిళ్లూ చట్టవిరుద్ధం. కానీ ఇప్పుడు 15 శాతం పెళ్లిళ్లు వీరి మధ్య జరుగుతున్నాయి. కానీ నిరుద్యోగం తెల్లవారిలో కంటె, నల్లజాతీయులలోనే ఎక్కువ. భత్యాలలో వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. దాని ఫలితమే ఇటీవలి మాంద్యం నల్లజాతిని బాగా కుంగదీసింది. అమెరికాలో నల్ల, తెల్ల జాతీయుల మధ్య ఆర్థిక సమానత్వం సాధిం చడం తన ముందున్న అతి పెద్ద లక్ష్యమని ఒబామా చాలా నిజాయితీగా అంగీకరించారు. ఒబామా అధ్యక్షుడు కావడం మార్టిన్ కల నెరవేరుతోందని చెప్పడానికి తార్కాణమని నల్లజాతీయుడు మిల్టన్ రాస్ (72) అభిప్రాయపడుతున్నాడు. ఇది అర్థసత్యమని అమెరికా శ్వేతజాతి వైఖరి తెలిసిన ఎవరైనా చెబుతారు. మార్టిన్ కల నెరవేరడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. నల్లజాతి జీవనం లో గుణాత్మకంగా ఎన్నో మార్పులు వచ్చా యి. అయితే వచ్చిన ఈ పరివర్తన శ్వేతజాతీయులవల్ల మాత్రం కాదు. నల్లజాతి పోరా ట పటిమే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిం ది. ఆ పోరాట స్ఫూర్తిని నల్ల జాతీయులకు ఇచ్చినవాడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. - డా॥గోపరాజు నారాయణరావు