‘‘శ్వేత జాతీయులు గౌరవించాల్సిన హక్కులేవీ ఆఫ్రికన్ అమెరికన్లకు లేవు.’’ 1857 నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రోజర్ టానీ మాటలే అమెరికాలోని శ్వేతజాతి పోలీసు అధికారులలో చాలా మందికి శిరోధార్యంగా నిలుస్తున్నాయి. కాబట్టే ఈ నెల 9న పద్దెనిమిదేళ్ల మైఖేల్ బ్రౌన్ పోలీసు తూటాలకు బలైపోయాడు. ఫుట్‌పాత్ మీద కాక రోడ్డు మీద నడవడం బ్రౌన్ చేసిన తప్పు. బ్రౌన్ హత్యకు నిరసనగా ఫెర్గ్యూసన్ భగ్గున మండటంతో పోలీసులు హడావిడిగా ఒక అతుకుల బొంత కథనాన్ని చెప్పారు.
దాని ప్రకారం బ్రౌన్‌కు ఒక దొంగతనంతో సంబంధం ఉంది. బ్రౌన్ దొంగే అయినా కాల్చి చంపేసే హక్కు ఏ పోలీసు అధికారికి లేదు. పైగా ‘దొంగ’ చేతులు రెండూ తలపై పెట్టి లొంగిపోవడానికి సిద్ధంగా ఉండగా కాల్చాల్సిన అవసరం అసలే లేదు. ఎంత కరడుగట్టిన నేరస్తుడైనా పోలీసు కాల్పులకు కుప్పకూలి గంటల తరబడి అక్కడే పడి ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా అవన్నీ జరిగాయంటే బ్రౌన్ నల్ల జాతి అమెరికన్ కాబట్టే. ‘‘ప్రపంచంలోని అత్యంత విస్ఫోటకరమైన, ప్రమాదకరమైన చెడుగు జాత్యహంకారమే. అది ఒక్కటిగా బతకలేని మనుషుల అశక్తత. ప్రత్యేకించి పాశ్చాత్య ప్రపంచపు అశక్తత’’ అని ఎలుగెత్తి చాటిన మాల్కమ్ ఎక్స్ హత్యకు గురై అర్ధ శతాబ్ది గడుస్తోంది.
అయినా ఆ అశక్తత అమెరికాను వీడలేదు. కాబట్టే బ్రౌన్ పోలీసు హత్యను, దానికి వెనుక ఉన్న జాత్యహంకారాన్ని ప్రశ్నించిన 90 ఏళ్ల పండుటాకు హెడీ ఎప్‌స్టీన్ చేతులకు బేడీలు, కారాగారవాసం. హెడీలాంటి వృద్ధుల నుండి బాష్ప వాయు గోళాలకు, రబ్బరు బుల్లెట్లకు క్షతగాత్రులవుతున్న ఎనిమిదేళ్ల పసివాళ్ల వరకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారే. నిరసనకారులు పోలీసులపై మాల్టోవ్ కాక్‌టెయిల్స్ (పెట్రోల్ బాంబులు) ప్రయోగించడం పోలీసు కట్టుకథ. సాక్ష్యం, పోలీసు లాఠీ దెబ్బల రుచిని చూసిన మీడియా ప్రతినిధులే. నిరసనకారులు ఘర్షణలకు దిగేలా రెచ్చగొడుతున్న పోలీసులే వారిని ‘‘పథకం ప్రకారం, సంఘటితంగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న గుంపులు’’గా చిత్రీకరిస్తున్నారు.
అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధించి, నేషనల్ గార్డు సాయుధ పారా మిలిటరీ బలగాలను, సైనిక సాయుధ శకటాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తెస్తామంటున్నారు. ‘ఫెర్గ్యూసన్’ ఒక విడి ఘటన కాదు. ఒక ధోరణిగానే నల్లజాతి పౌరులపై శ్వేతజాతి పోలీసుల, పౌర రక్షణ దళాల హత్యాకాండ పెచ్చుపెరిగిపోతోంది. 2006-12 మధ్య వారానికి సగటున ఇద్దరు నల్లజాతి అమెరికన్లు శ్వేతజాతి పోలీసుల కాల్పుల్లో మరణించారు. జూలై 17న జరిగిన 16 ఏళ్ల ఎరిక్ గార్నర్ హత్య కూడా దేశవ్యాప్తంగా ఆందోళనను రేకెత్తించింది. బ్రౌన్ హత్య తర్వాత రెండు రోజులకే కాలిఫోర్నియాలో మానసిక వికలాంగుడైన మరో నల్లజాతీయుడు పోలీసు కాల్పులకు బలైపోయాడు. నల్లజాతి అమెరికన్లలో నేరస్వభావం పెరిగిపోతోందంటూ పలువురు రిపబ్లికన్ నేతలు అతి తరచుగా శ్వేతజాత్యహంకార పోలీసు వ్యవస్థకు వత్తాసు పలకడం పరిపాటిగా మారింది.
కానీ ఏటా దేశంలో హత్యలకు గురయ్యే వారిలో 50 శాతానికిపైగా... జనాభాలో 12 శాతంగా ఉన్న నల్ల జాతీయులే. పోలీసు వ్యవస్థేకాదు, న్యాయవ్యవస్థ సైతం జాత్యహంకార పోకడలను నిస్సిగ్గుగా ప్రదర్శిస్తుండటం విశేషం. ఏ నేరానికైనా శ్వేతజాతీయులకంటే నల్లజాతి వారి విషయంలో శిక్ష పడే అవకాశం 38 శాతం ఎక్కువని జాతీయ నేరాల గణాంకాలే చెబుతున్నాయి. ‘‘ఇదంతా ఎలా మొదలైందనేది కూడా ముఖ్యమైనది, నిజమే. ఒక యువకుడు విషాదకర పరిస్థితుల్లో మరణించడం హృదయవిదారకమైనదే’’ అంటూ అమెరికా మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షుడు బరాక్ ఒబామా... దేశంలో రోజురోజుకూ ఘనీభవిస్తున్న శ్వేత జాత్యహంకార పోకడలను గుర్తించ నిరాకరించడం ఆశ్చర్యకరం.
నల్లజాతి అమెరికన్లలో 88 శాతం జాతి వివక్షకు గురవుతున్నామని భావిస్తున్నట్టు ‘ప్యూ’ పరిశోధనా సంస్థ తాజా సర్వేలో తేలింది. బానిసత్వ నిర్మూలనను వ్యతిరేకించి స్వతంత్రం ప్రకటించుకున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన ముస్సోరీ నేటికీ శ్వేతజాత్యహంకార పోకడలకు మారు పేరు. పైగా ఫెర్గ్యూసన్‌లో 68 శాతం నల్లజాతీయులు కాగా అక్కడి పోలీసు అధికారుల్లో ముగ్గురంటే ముగ్గురే నల్లజాతీయులు! దీనికి తోడు నల్లజాతివారంటేనే నేరస్తులుగా ముద్రవేయడం, కేసుల్లో ఇరికించడం పోలీసులకు, శిక్షించడం న్యాయమూర్తులకు అలవాటుగా మారింది. పైగా పేదరికం, నిరుద్యోగం, విద్యావకాశాల లేమి వంటి సమస్యలకు నేరగ్రస్తతకు మధ్య ఉన్న సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుంటే నల్లజాతి వారిలో పెరిగిపోతుందంటున్న ‘నేరగ్రస్త స్వభావం’ జాతిపరమైనది కాదు జాతీయ విషాదం.
అది అన్ని జాతుల ప్రజలను పట్టి పీడిస్తున్న అర్థిక మాంద్యపు ప్రభావం. సరిగ్గా అదే జాత్యహంకార మితవాద శక్తులు బలపడటానికి కారణమౌతోంది. నల్లజాతి వారిలో సర్వత్రా అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ‘‘శ్వేత జాతీయులు మన కోసం నిర్మిం చిన మురికి కూపాల్లో మనం నిత్యం బతుకు పోరాటం చేస్తూ గడిపాలని శాసించారే తప్ప అంతకు మించిన పెద్ద లక్ష్యాల సాధన కోసం కాదు.’’ నాటి మాల్కమ్ మాటలే నేటి అమెరికా సత్యంగా నిలిచిన ఫలితమే ముస్సోరీలోని దావానలం. ఆయనే అన్నట్టు ‘‘సాధారణంగా ప్రజలు విషాదంగా ఉన్నప్పుడు ఏమీ చేయరు, ఏడుస్తారంతే. అదే ఆగ్రహానికి గురైనప్పుడు మార్పును తీసుకొస్తారు.’’
నేటి అమెరికా ‘నల్ల’ నిజం
Published Thu, Aug 21 2014 12:18 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement