సాక్షి, న్యూఢిల్లీ : మనుషులు తినే ఆహారం బట్టి వారు ఏ దేశస్థులో ఇట్టే చెప్పవచ్చట! ఈ విషయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శుక్రవారం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘మా ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు తింటున్న ఆహారం చూసి నాకు వారి జాతీయత మీద అనుమానం వచ్చింది. వారంతా పోహా (అటుకుల ఉప్మా) తింటున్నారు. అది చూసి వారు బంగ్లాదేశ్ వాసులని నాకు అనుమానం వచ్చింది. రెండు రోజుల తర్వాత అదే విషయాన్ని వారిని నేను అడిగా. అంతే అప్పటి నుంచి వారు మా ఇంటి పనికి రావడం మానేశారు’ అని కైలాష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వాటిపై ఇప్పుడు ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.
‘ఇండోర్‌లో ఇటీవలనే క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌తో కలసి జలేబీ, పోహా పసందుగా తింటూ కనిపించారు’ మొహమ్మద్ జుబేర్ వారి ఫొటోను షేర్ చేశారు. ‘మా పని మనిషి కేవలం న్యూఢిల్స్ మాత్రమే తింటుంది. బహూశ ఆమె చైనా దేశస్థురాలు కావచ్చు’ అని నిర్మలా థాయ్ హల్వే వాలి ట్వీట్ చేశారు. ‘మా చాకలి బర్గర్ తింటున్నాడు. వాడు అమెరికన్ కావచ్చు’ అని కాజోల్ శ్రీనివాసన్ స్పందించారు. ‘ఇటీవల మా ఇంటి నిర్మాణం పనుల కోసం వచ్చిన కూలీలు ఎవరు తిననిది తింటిన్నారు. వారు పేడ తింటున్నారు. వారు సంఘీస్ కావొచ్చు’ భక్త్స్ నైట్‌మేర్ ట్వీట్ చేశారు.
‘మొదట్లో ఆవు తినేవారంతా యాంటీ నేషనల్స్. ఇప్పుడు పోహా తినే వారంతా యాంటీ నేషనల్స్’ అని, ‘పోహా ఇప్పుడు యాంటీ నేషనల్’ అని అద్వైత్, ప్రవీణ్ శామ్యూల్‌లు స్పందించారు. పోహాను మధ్య భారత్‌లో, పశ్చిమ భారత్‌లో ఎక్కువగా తింటారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా తింటారు.
Comments
Please login to add a commentAdd a comment