
కొందరు బందీలకు విముక్తి
నైరోబి: కెన్యా షాపింగ్‌మాల్‌లో చొరబడిన ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ సంఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 62కు చేరింది. ఉగ్రవాదుల చెర నుంచి కొందరు పౌరులను విడిపించినట్టు కెన్యా హోంమంత్రిత్వశాఖ పేర్కొంది. అల్‌కాయిదాతో సంబంధాలున్న అల్ షబాబ్ మిలిటెంట్లు గత శనివారం నైరోబిలోని వెస్ట్‌గేట్ షాపింగ్‌మాల్‌లో చొరబడి నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో 69 మంది మరణించారని కెన్యా రెడ్‌క్రాస్ సొసైటీ ఇదివరకు ప్రకటించింది. కాగా, మాల్‌లో పది పదిహేను మంది ఉగ్రవాదులున్నారని, వారిచెరలో మరికొందరు పౌరులున్నారని కెన్యా పోలీసులు తెలిపారు.
. షాపింగ్‌మాల్ పై అంతస్తులోకి వెళ్లడానికి భద్రతాదళాలు ప్రయతిస్తున్నాయని ఐజీపీ డేవిడ్ కిమాయో తెలిపారు. ఉగ్రవాదులపై త్వరలో పైచేయి సాధించి బందీలనందరినీ సురక్షితంగా విడిపిస్తామని ఆయన చెప్పారు. కాగా, ఉగ్రవాదులను వదిలి వేసే ప్రసక్తే లేదని, వారిని కఠినంగా శిక్షిస్తామని కెన్యా అధ్యక్షుడు ఉహ్రూ కెన్యాట్టా హెచ్చరించారు. నైరోబియా షాపింగ్ మాల్‌పై దాడికి తామే బాధ్యులమని సోమాలియా ఉగ్రవాదులు ప్రకటించారు. 2011 అక్టోబర్‌లో దక్షిణ సోమాలియా సరిహద్దుల్లో కెన్యా సైన్యం జరిపిన ఊచకోతకు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్టు ఉగ్రవాదులు పేర్కొన్నారు.
ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థాలు
ఇదిలా ఉండగా, సోమాలియా ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థాలున్నాయని కెన్యా అధికారులు చెప్పారు. సిసి టివి కెమెరా ఫుటేజ్‌లు పరిశీలించగా షాపింగ్ మాల్ ముందు,వెనుక గేట్లగుండా ఉగ్రవాదులు రెండు బృందాలుగా లోనకు ప్రవేశించారని తెలిపారు. వారివద్ద గ్రెనేడ్లు, రైఫిళ్లు, పిస్టళ్లు పెద్దసంఖ్యలో ఉన్నాయని,వస్తూనే గ్రెనేడ్లు విసిరి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు. ఇస్లాం సూక్తులు వల్లె వేయాలని పౌరులను ఆదే శించారని, వల్లె వేసిన వారిని వదిలివేశారని, చేయలేనివారిని అక్కడికక్కడే కాల్చిచంపారని ఫుటేజ్ ద్వారా తెలిసిందన్నారు.