
జనరంజక ‘నియంత’!
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు దుతర్తే రూటే సెపరేటు
- డ్రగ్ డీలర్లు కనిపిస్తే కాల్చేయండి
- అధ్యక్ష హోదాలో దేశ ప్రజలకు పిలుపు
దవావో(ఫిలిప్పీన్స్) నుంచి సాక్షి ప్రతినిధి
‘‘డ్రగ్ డీలర్లనే కాదు, వాటికి బానిసలైన వారిని కూడా కనిపిస్తే కాల్చేయండి. మీపై ఏ కేసూ లేకుండా చూసుకుంటా. ప్రక్షాళనకు ఏకైక మార్గం మారణకాండే. ఓ లక్షమందినైనా చంపించేస్తా. వారి శవాల్ని చేపలకు ఆహారంగా మనీలా అఖాతంలో పాతరేయిస్తా. మంచి లాభాలు కళ్లజూడాలనుకునేవారు శ్మశానవాటికల వ్యాపారం పెట్టుకోండి. బ్రహ్మాండంగా సాగుతుంది. నాదీ హామీ!’’
ఒక దేశాధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరంటే నమ్మగలమా? కానీ ఫిలిప్పీన్స్ కొత్త అధ్యక్షుడు రోడ్రిగో దుతర్తే ఇలాంటి విస్ఫోటక వ్యాఖ్యలకు పెట్టింది పేరు! డ్రగ్ మాఫియాను తిట్టిపోసినంత అలవోకగా కేథలిక్ మత పెద్దలు మొదలుకుని సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితిపైనా బూతు పదజాలంతో విరుచుకుపడటం దుతర్తేకు వెన్నతో పెట్టిన విద్య. గురువారం దేశాధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన, ఆ సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఇలాంటి వ్యాఖ్యతో చెలరేగారు. ‘పోలీసులతో పాటు అన్ని శాఖల్లోనూ అవినీతి పెచ్చరిల్లింది. దీన్ని ఇకపై సహించను. ఎవరైనా సరే, తాట తీస్తా’ అని హెచ్చరించారు.
ఇలాంటి వ్యాఖ్యల వల్లే ఫిలిప్పైన్‌వాసులు మాత్రం దుతర్తే అంటే పడిచస్తుంటారు. మే 9నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 60 లక్షల పై చిలుకు భారీ మెజారిటీతో ఆయనను తమ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. దుతర్తే సొంత పట్టణం దవావోలోని జనం బట్టల దగ్గరి నుంచి నడిపే వాహనాల దాకా అన్నింటిపైనా దుతర్తే ఫొటోలే! 71 ఏళ్ల దుతర్తే, ఫిలిప్పీన్స్ అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో అత్యంత పెద్ద వయస్కుడు. కానీ రూపంలో గానీ, మాటల్లో గానీ, చివరికి చేతల్లో గానీ ఆ వయోభారం మచ్చుకైనా కనిపించదు! దవావో మేయర్‌గా రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన దుతర్తే... ఒకప్పుడు హత్యలకు, డ్రగ్స్ మాఫియాకు మారుపేరుగా ఉన్న నగరాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళించి ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సురక్షిత నగరాల్లో టాప్ టెన్‌లో చేర్చారు. అయితే, అందుకోసం హంతక ముఠాలను నడిపారని, వందలాదిగా డ్రగ్ డీలర్లను చంపించారని అభియోగాలను ఎదుర్కొన్నారు! స్వయానా లా గ్రాడ్యుయేట్ అయ్యుండి కూడా ఇలా చట్టాలను అతిక్రమించడాన్ని, ప్రజలను కూడా అందుకు ప్రోత్సహించడాన్ని దుతర్తే స్టైల్ అని సరిపెట్టుకోవాల్సిందే.