ప్యాంగ్‌యాంగ్ : అంతుచిక్కని వ్యాధితో ఉత్తరకొరియా ప్రజలు బెంబేలెత్తిపోతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. అణు పరీక్షల వల్ల విడుదలైన కాలుష్య పదార్థాలు కిమ్ దేశ ప్రజలపై పెను ప్రభావం చూపుతున్నాయి. గర్భస్థ శిశువులపైనా, స్త్రీ, పురుషుల ప్రత్యుత్పత్తి, నాడీ వ్యవస్థల మీద రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటున్నట్లు తెలిసింది.
2011లో దేశ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కింగ్ జాంగ్ ఉన్ వరుస అణు పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరకొరియాలో ఉన్న అణు పరీక్షా కేంద్రాల్లో ఒకటైన ‘పంగ్యే రీ’ వద్ద రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీంతో పంగ్యే రీ వద్ద పహారా ఉంటున్న సైనికులు అంతుచిక్కని దెయ్యం వ్యాధి బారిన పడి మృత్యువాత పడుతున్నారు. దీంతో భయాందోళనలకు గురవుతున్న సైనికులు.. తప్పించుకునేందుకు దక్షిణ కొరియాలోకి పారిపోతున్నారు.
ఇప్పటివరకూ 30 మంది ఉత్తరకొరియా సైనికులు అనారోగ్య కారణాల రీత్యా దక్షిణ కొరియాలోకి పారిపోయి వచ్చినట్లు మీడియా రిపోర్టులు వచ్చాయి. రేడియేషన్కారణంగా విపరీతమైన నొప్పికి సైనికులు గురైనట్లు వారికి చికిత్స అందించిన దక్షిణ కొరియా వైద్యులు చెప్పారు. అణు పరీక్షల వల్ల ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్యకు లెక్కేలేదని దక్షిణ కొరియాలోకి పారిపోయి వచ్చిన ఓ సైనికుడు తెలిపారు.
దీంతో రేడియేషన్ కారణంగా బాధపడే వారిని ‘ఘోస్ట్ డిసీజ్’ తో బాధపడుతున్నట్లు ఉత్తరకొరియాలో చెబుతారని వెల్లడించారు. అవయవ లోపంతో జన్మించిన శిశువులను చంపేస్తారని తెలిపారు. దీంతో తల్లిదండ్రులే బిడ్డలను చంపుకున్నట్లు అవుతుందని వివరించారు. అయితే, రేడియేషన్ కారణంగానే ఉత్తరకొరియాలో మరణాలు సంభవిస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి ప్రత్యేక ఆధారాలు లభ్యం కాలేదని శాస్త్రవేత్తలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment