
ఉత్తర కొరియా అధినేత సోదరుడి హత్య
సియోల్(దక్షిణకొరియా):
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోన్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జోంగ్ నాం(45) మలేసియాలో హత్యకు గురయ్యాడు. దేశంలో నియంతృత్వ పోకడలను నిరసించిన ఆయన అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. లాయర్ అయిన కిమ్ జోంగ్‌నామ్‌ను తన తండ్రి కిమ్ జోంగ్-2 హయాంలో రాజకీయ వారసుడిగా పరిగణించేవారు. ఆయన మరణానంతరం సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ పాలన పగ్గాలు చేపట్టారు.
దీంతో కిమ్ జోంగ్ నాం ప్రాణభయంతో 2001లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో జపాన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అనంతరం అమెరికా వెళ్లి అక్కడ కొంతకాలం గడిపాడు. ఎక్కువగా చైనాలోని మకావు ప్రాంతంలోనే ఆయన నివసించాడు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం మలేసియా వస్తూ కౌలాలంపూర్ విమానాశ్రయంలో దిగాడు. అక్కడ ఉండగానే గుర్తు తెలియని ఇద్దరు మహిళా ఏజెంట్లు ఆయనకు విషపు ఇంజెక‌్షన్లు ఇచ్చి మరుక్షణమే మాయమయ్యారని అధికారులు చెబుతున్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆయన చనిపోయాడని వెల్లడించారు. ఆగంతకుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
కాగా, 2013లో తన మామ అయిన జాంగ్ సాంగ్ థెక్‌కు ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరణ శిక్ష విధించాడు. అనంతరం అంతటి ప్రముఖుడిని చంపేయటం ఇదే ప్రథమం అని పరిశీలకులు అంటున్నారు.