కిమ్ సోదరుడు ఎన్నినిమిషాల్లో చనిపోయాడంటే..
కౌలాలంపూర్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు అత్యంత వేగంగా ప్రాణాలు కోల్పోయాడని మలేషియా ప్రభుత్వం తెలిపింది. విష ప్రయోగం కారణంగా సంభవించిన కిమ్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ మరణంపై ఆదివారం మలేషియా ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటన చేస్తూ సరిగ్గా 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో నామ్ మృత్యువాత పడ్డారని చెప్పారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఈ నెల(ఫిబ్రవరి) 13న నామ్‌పై ఇద్దరు మహిళలు విషప్రయోగం చేయడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు.
ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో చనిపోయారు. శుక్రవారం ఆయన పోస్టుమార్టం వివరాల్లో మలేషియాలో నిషేధించిన పవర్‌ఫుల్ కెమికల్ విషపదార్థం వీఎక్స్ నెర్వ్‌ను దాడి చేసినవాళ్లు ఉపయోగించడం వల్లనామ్ చనిపోయారని తెలిసింది. అసలు నామ్‌కు మలేషియా పోస్టుమార్టం చేయడమేమిటని ఉత్తర కొరియా మండిపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం ఆ రెండు దేశాల మధ్య కొంత వైరుధ్యాలు తీసుకొస్తున్న నేపథ్యంలో నామ్‌పై దాడి, వైద్యం, చావు, పోస్టుమార్టం, ఇలా ప్రతి విషయంలో స్పష్టతను కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా నామ్ మృతిపై అనుమానాలు తొలిగేలా అక్కడి ఆరోగ్యశాఖమంత్రి సుబ్రహ్మణ్యం సదాశివం ఓ ప్రకటన విడుదల చేశారు. మోతాదుకు మించిన వీఎక్స్ విషయం ఇవ్వడం వల్లే నేరుగా అతడి గుండెపై ప్రభావం చూపి అనంతరం ఊపరితిత్తులు ఇలా శరీరంలోని ప్రధాన భాగాలపై తదనంతరం మొత్తం శరీరంపై ప్రభావం చూపి మృత్యువాత పడేలా చేసిందని అన్నారు. పది మిల్లిగ్రామ్‌ల వీఎక్స్ నెర్వ్‌ను ఉపయోగించినట్లు తెలిపారు. మొత్త నాడీ వ్యవస్థనే ఈ విషం ఒక్కసారిగా కుప్పకూల్చగలదని అన్నారు.