షాపింగ్ మాల్‌లో ఎగిసిపడుతున్న మంటలు
మాస్కో: రష్యాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తూర్పు రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని కెమెరొవో పట్టణంలో ఓ షాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగి 64 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో పది మంది గాయపడ్డారు. నాలుగు అంతస్తులున్న వింటర్ చెర్రీ అనే షాపింగ్ మాల్‌లో పిల్లల ఆటల కేంద్రాలు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు తదితర సౌకర్యాలు ఉంటాయి. చిన్నారుల ఆటలకు ఈ మాల్ బాగా ప్రాచుర్యం పొందింది. పాఠశాలలకు సెలవు లు ఇచ్చాక తొలి వారాంతం కావడంతో అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని సరదాగా గడపడానికి ఈ మాల్‌కు వచ్చారు. ఆదివారం సాయం త్రం మాల్ జనాలతో కిక్కిరిసిపోయి అందరూ ఆనం దోత్సాహాల్లో మునిగి తేలుతుండగా అకస్మాత్తుగా మంటలు ఆవరించి 64 మందిని బలితీసుకున్నాయి.
ఆదివారం రాత్రంతా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక దళ సిబ్బంది తీవ్రంగా శ్రమించి సోమవారం ఉదయానికి మంటలను ఆర్పగలిగారు. నాలుగు అంతస్తుల్లోనూ క్షణ్నంగా గాలింపు చేపట్టిన తర్వాత 64 మృతదేహాలను సిబ్బంది కనుగొన్నారని అధికారులు తెలిపారు. అయితే వారిలో చిన్నారులు ఎంత మంది ఉన్నారనే విషయం వారు వెల్లడించక పోయినప్పటికీ ఎక్కువమంది పిల్లలే చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. గాయపడిన వారిని వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలను గుర్తించి నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకిన 11 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉండగా, అతని తల్లిదండ్రులు, తమ్ముడు మంటల్లో చిక్కుకుని మరణించారు.
మోగని ఫైర్ అలారం.. కనిపించని సిబ్బంది
మృతుల సంఖ్యను తగ్గించడంలో షాపింగ్ మాల్ యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మంటలు చెలరేగినా ఫైర్ అలారం అసలు మోగనేలేదని ప్రాణాలతో బయటపడినవారు చెప్పారు. సినిమా థియేటర్ బయట ఉన్న వారు వచ్చి చెప్పే వరకు లోపలివారికి మంటల విషయమే తెలియదనీ, ఆ తర్వాత అందరూ బయటకు పరుగులు తీస్తున్నా థియేటర్ సిబ్బంది కనీసం లైట్లు కూడా వేయలేదని ఓ బాధితురాలు తెలిపారు.
మృతులకు నివాళులర్పిస్తున్న స్థానికులు
Comments
Please login to add a commentAdd a comment