గుడ్ బై గుడ్ బై మై డియర్ 'లీ'
సింగపూర్: సింగపూర్ వ్యవస్థాపక ప్రధాని లీ క్వాన్ యూ అంతిమయాత్ర ప్రారంభమైంది. గత సోమవారం చనిపోయిన ఆయన పార్థీవదేహాన్ని పార్లమెంటు భవనంలో పలువురు ప్రముఖుల దర్శనార్థం ఉంచిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం బ్రిగేడియర్ జనరల్ ఓంగ్జి చిన్ నేతృత్వంలోని ఎనిమిదిమంది సీనియర్ కమాండర్ల ఆధ్వర్యంలో లీ శవపేటికను పార్లమెంటు భవనం వెలుపలికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు వీడ్కోలు పలికేందుకు అశ్రునయనాలతో అశేష జనవాహిని అక్కడకు వచ్చింది.
వీధుల్లో చేరిన జనం రోధిస్తూ 'గుడ్ బై గుడ్ బై మై డియర్ లీ' అంటూ వీడ్కోలు చెప్పారు. భారీ భద్రత బలగాలు మోహరించాయి. భారీ పరేడ్ నిర్వహించాయి. తమ చేతుల్లోని తుఫాకీలతో గౌరవ వందనం సమర్పించాయి. దాదాపు నాలుగు లక్షలమందికి పైగా ఆయన పార్థీవదేహానికి నివాళులు అర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షింజో అబే, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ ఇతర దేశాల ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు.