న్యూయార్క్ : కరోనా వైరస్ కట్టడి కోసం అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ను తొందరపడి ఎత్తివేయరాదని, అలా చేసినట్లయితే కరోనా వైరస్ ఒక్కసారిగా మరోసారి విజృంభించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ టకేషి కాసాయి ప్రపంచ దేశాలను హెచ్చరించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రజలు కొత్త జీవన విధానానికి అలవాటు పడాలని ఆయన పిలుపునిచ్చారు. సాధ్యమైనంత త్వరగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసేందుకు పలు దేశాలు, ముఖ్యంగా అమెరికా ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 25 లక్షల మంది కరోనా వైరస్ బారిన పడగా, వారిలో 1,70,000 మంది మరణించారు. అమెరికాలో 7,87,000 మంది వైరస్ బారిన పడగా, వారిలో 42 వేల మంది మరణించారు. తమకు జీవనోపాధి లేకుండా పోయిందని, తమ హక్కులను హరించి వేస్తున్నారంటూ డెమోక్రట్ల పాలనలోని రాష్ట్రాల్లో ప్రజలు ఆందోళన చేస్తుంటే, దేశ ఆర్థిక పరిస్థితి పునరుద్ధరణలో భాగంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారని వార్తలు వెలువడ్డాయి. ముందుగా చేసిన ప్రకటన వరకు అమెరికాలో లాక్‌డౌన్ ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది.
లాక్‌డౌన్‌ను ఒక్కసారిగా ఎత్తివేయరాదని, అలా చేసినట్లయితే ఇంతకాలం చేసిన కృషి మంటగలసి పోతుందని, సడలింపుల ద్వారా క్రమంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ అదే క్రమంలో ఆర్థిక పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని డాక్టర్ టకేషి పిలుపునిచ్చారు. (చదవండి: లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా అల్లర్లు)
Comments
Please login to add a commentAdd a comment