
వాషింగ్టన్: కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలు, ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాపించింది. కరోనా కేసుల సంఖ్య 45 లక్షలకు చేరుకోగా, మృతుల సంఖ్య 3 లక్షలు దాటింది. అమెరికాలో ఇప్పటి వరకు 85,534 మంది మరణించగా పాజిటివ్ కేసులు 14.37 లక్షలకు మించిపోయాయి. కరోనాపై సకాలంలో చర్యలు తీసుకున్న న్యూజిల్యాండ్, జపాన్ ప్రభుత్వాలు క్రమేపీ ఆంక్షలు సడలించేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. ఇథియోపియాలో మాస్కులు ధరించని వెయ్యిమందిని పోలీసులు అరెస్టు చేశారు. కరోనాతో సతమతమవుతున్న ఫిలిప్పీన్స్‌పై తాజాగా టైఫూన్ ‘వొంగ్‌ఫాంగ్’ప్రభావం చూపుతోంది. ఫిలిప్పీన్స్ తూర్పు ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం తరలించింది.
వ్యాక్సిన్ తయారీ, పంపిణీకి ప్రత్యేక బృందం
కరోనా టీకా తయారీతోపాటు అమెరికన్లందరికీ ఈ ఏడాది చివరికి దానిని అందుబాటులోకి తెచ్చే బాధ్యతను ప్రత్యేకంగా ఓ అధికారికి అప్పగించేందుకు అధ్యక్షుడు ట్రంప్ రంగం సిద్ధంచేశారు. ఫార్మా రంగానికి చెందిన గ్లాక్సో స్మిత్‌క్లైన్ సంస్థ మాజీ ఉన్నతాధికారి మోన్సెఫ్ స్లవోయీని ఇందుకు ఎంపిక చేశారు. మోన్సెఫ్ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోను న్నారు. ఈ బృహత్తర బాధ్యతల్లో ఆయనకు ఆర్మీ మెటీరియల్ కమాండ్ కమాండర్ జనరల్ గుస్తావ్ పెర్నా సహాయ పడతారు. ఇందుకు సంబంధించి ట్రంప్ త్వరలో ఒక ప్రకటనచేసే అవకాశముంది. ‘ఆపరేషన్ వార్ప్ సీడ్’అని పిలిచే ఈ ప్రత్యేక కార్యక్రమం లక్ష్యం..దేశంలోని పౌరులకు 30 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఈ ఏడాది చివరికల్లా తయారు చేయడం, అందరికీ పంపిణీ చేయడం. వేగంగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడమే ట్రంప్ లక్ష్యమని అధ్యక్ష భవనం వర్గాలు అంటున్నాయి.