వ్యాధి నిరోధక వ్యవస్థతో మెదడుకు నేరుగా లింకు
వాషింగ్టన్: మనిషి వ్యాధి నిరోధక వ్యవస్థ(ఇమ్యూన్ సిస్టమ్)కు సంబంధించి పరిశోధకులు కొత్త నిజం కనుగొన్నారు. వ్యాధినిరోధక వ్యవస్థతో మెదడుకు నేరుగా నాళాల ద్వారా అనుసంధానమై ఉంటుందని వారు గుర్తించారు. మనిషి శరీరంలోకి ప్రవేశించే హానికర సూక్ష్మజీవులను నాశనం చేసే తెల్లరక్త కణాలు శోషరస కణుపుల్లో ఉంటూ, శోషరస నాళాల ద్వారా ప్రయాణిస్తాయన్నది తెలిసిందే. అయితే, ఈ నాళాలు మెద డుకు అనుసంధానమై ఉండవని శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా భావిస్తున్నారు. కానీ మెదడుకు సంబంధించిన మస్తిష్క శోషరస నాళాల ద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థ అనుసంధానమై ఉంటుందని తాజాగా యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా పరిశోధకులు కనుగొన్నారు. దీంతో వ్యాధి నిరోధక వ్యవస్థకు మెదడు ఎలా ప్రతిస్పందిస్తోంది? నాడీకణాలు ధ్వంసం అయ్యే మల్టిపుల్ స్క్లిరోసిస్ రోగులు ఎందుకు రోగ నిరోధక వ్యవ స్థ దాడికి గురవుతున్నారు? ఆటిజం, అల్జీమర్స్ వ్యాధులపై వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రభావాలు, తదితర అంశాలను మరింత బాగా అర్థం చేసుకునేందుకు వీలు కానుందని భావిస్తున్నారు.