అదా విషయం.. అయితే ‘రైట్ రైట్’
మెదడు పరిణామక్రమానికి చేతివాటానికి లింకు
మనలో 90 శాతం మంది కుడిచేతివాటం వారే! ఎందుకలా? దీని వెనుక కారణం ఏంటి? మానవ మెదడు పరిణామక్రమానికి ఈ అలవాటుకు ఏమైనా సంబంధం ఉందా? పరిశోధకులు తాజాగా ఈ ప్రశ్నల గుట్టు విప్పారు. మనుషుల్లో అనాదిగా మెజారిటీ ప్రజలు చాలా పనులకు ఎడమచేతిని కాకుండా కుడిచేతినే వాడడానికి గల కారణాలను విశ్లేషించగా ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. ఈ అలవాటుకు కారణం మనుషుల చేతుల్లో కాదు వారి పళ్లలో దొరికింది! అంతేకాదు కుడిచేతివాటానికి, మనిషి మెదడు పరిణామ క్రమానికి కూడా దగ్గరి సంబంధం ఉన్నట్టు తేలింది.
ఆదిమానవుల పరికరాల ద్వారా..
మన మెదడును నిలువుగా చూస్తే రెండువైపులా రెండు సమ భాగాలుగా కనిపిస్తుంది. ఎడమవైపు భాగం.. భాష, కదలికలకు సంబంధించిన పనులను నియంత్రిస్తే, కుడి భాగం చూపు, దూరం, దగ్గర వంటి అంశాలను నియంత్రిస్తుంది. కానీ మెదడులో ఒకవైపు భాగం.. రెండోవైపు భాగంతో పోలిస్తే అత్యంత క్రియాశీలకంగా ఉంటుంది. ఈ భాగంలోనే క్లిష్టమైన పనులను మెదడు నిర్వర్తిస్తుంది. ఈ కీలక భాగానికి, చేతివాటానికి దగ్గరి సంబంధం ఉందని పరిశోధకులు తేల్చారు. ఆదిమానవులు వాడిన రాతి పరికరాల ద్వారా ఈ అంచనాకు వచ్చారు. ఆఫ్రికాలోని కెన్యాలో 33 లక్షల సంవత్సరాల క్రితం ఆదిమానవులు వాడిన రాతి పరికరాలు దొరికాయి. వాటి తయారీ, వినియోగం విధానాన్ని విశ్లేషించగా.. అవన్నీ కుడిచేతివాటం వారికి అను కూలంగా ఉన్నట్టు తేలింది. అలాగే మెదడులోని క్రియాశీలక భాగానికి కుడిచేతివాటానికి దగ్గరి సంబంధం ఉన్నట్టు గుర్తించారు.
పళ్లపై చారికలు..
ఐరోపాలో నియాండర్తల్ దశకు చెందిన కొన్ని మానవ అస్తిపంజరాలపై సైంటిస్టులు పరిశోధనలు చేశారు. ఇందులో నోటి ముందుభాగంలోని ఎడమవైపు పళ్లపై కొన్ని బలమైన గీతలు, చారికలు కన్పించాయి. ఇవి ఎలా ఏర్పడి ఉంటాయన్న దిశగా అధ్యయనం చేశారు. ఏదైనా పరికరాన్ని సాగదీసి నోటిలో బిగించి పట్టుకొని, కుడిచేతితో పని చేస్తున్న సమయంలో పొరపాటున అది తెగి పంటికి తాకడం వల్ల ఆ చారికలు ఏర్పడినట్టు గుర్తించారు. ఈ అంచనాకు వచ్చేందుకు నోటికి రక్షణగా గార్డులు ధరించి కుడిచేతితో పనిచేస్తూ ఇదే తరహా ప్రయోగం చేశారు. ఇందులో సరిగ్గా ఎడమవైపు ఉన్న పళ్లకు దెబ్బ తగిలి చారికలు ఏర్పడ్డాయి. దీంతో అప్పటివారు కుడిచేతి వాటంవారేనని పరిశోధకులు ఓ అంచనాకు వచ్చారు.