ఎక్కువ సమయం పనిచేస్తున్నారా.. జాగ్రత్త!
న్యూయార్క్: ప్రతిరోజు గంటల తరబడి పనిచేస్తున్నారా.. అయితే జాగ్రత్త! మీ ఆరోగ్యం ప్రమాదపు అంచునా ఉంది. మగవారితో పోలిస్తే ఎక్కువ సమయం పనిచేసే మహిళలకే ప్రమాదం పొంచి ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.. ఒకప్పుడు ఇంటికి మాత్రమే పరిమితమయ్యే మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ రాణిస్తూ మగవారితోపాటు సమానంగా అన్ని విషయాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చుల కారణంగా కుటుంబ పోషణ భారం కావడంతో మగవారితో పాటు మహిళలూ ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తున్నారు. ఇటు ఇంటి ఇల్లాలుగానూ, అటు ఉద్యోగినిగానూ అన్ని విషయాల్లో సమయానికి మించి ఎక్కువ సమయం పనిచేయడం మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతిస్తోందని ఓ సర్వేలో వెల్లడైంది.
వారానికి 60 గంటలకు పైగా పనిచేసే మహిళల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువ ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా మహిళ్లల్లో ఎక్కువగా డయాబెటీస్, కేన్సర్, గుండె సంబంధిత వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఒహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన నిపుణుడు అల్లార్డ్ డెంబె పేర్కొన్నారు. 32 సంవత్సరాల వయస్సు ఉన్న 7,500 మంది మహిళలను సంప్రదించి వారి జీవినశైలిపై పరిశోధించారు. ఈ పరిశోధనలో ఎక్కువ సమయం మహిళలు ఇంటా బయటా ఉద్యోగ నిర్వహణలోనూ, కుటుంబ బాధ్యతలు, పని కారణంగా తీవ్ర ఒత్తిడి లోనవుతున్నారని తెలిపింది. పని ఒత్తిడి కారణంగానే మహిళల్లో అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయని నిపుణుడు అల్లార్డ్ డెంబె పేర్కొన్నారు.
సాధారణంగా ఎక్కువగా పనిచేసే మహిళల్లో గంటల సమయం 40 నుంచి 50కు మించినట్లయితే వారి ఆరోగ్యం క్రమక్రమంగా అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని పరిశోధనలో గుర్తించినట్టు తెలిపారు. మూడు దశాబ్దాల్లో 60 గంటలకు మించి మహిళలు పనిచేసినట్టయితే వారిలో డయాబెటిస్, కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులు ప్రబలడానికి మూడు రెట్లుకు పైగా అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో 20 నుంచి 30, 40 వయస్సు ఉన్న వారికి ఆరంభంలో సమస్యల ప్రభావం అంతగా కనిపించదని.. వారి జీవితంలో క్రమక్రమంగా ఆరోగ్యంలో మార్పులు చోటుచేసుకుంటాయని పరిశోధనలో వెల్లడైంది.