
చేపలు కావాలా నాయనా..
చేపలు తినాలని ఉంది.. సూపర్ మార్కెట్‌కు వెళ్లాం.. తీసుకున్నాం.. డబ్బులు చెల్లించాం.. వచ్చేశాం. వంట చేసుకుని తినేశాం..
ఇప్పుడు..
చేపలు తినాలని ఉంది.. సూపర్ మార్కెట్‌కు వెళ్లాం.. తీసుకున్నాం.. డబ్బులు చెల్లించాం.. వచ్చేశాం. వంట చేసుకుని తినేశాం..
ఒకప్పుడు..
చేపలు తినాలనుకుంటే ముందు చెరువుకు పోవాలి.. వాటిని పట్టాలి.. ఆ తర్వాతే వంట..
ఈ రెండు విధానాలను మిక్స్ చేస్తే.. బంగాళదుంపలు ఎక్కడ్నుంచి వస్తాయంటే.. చెట్లకు కాస్తాయి అని చెబుతున్న ప్రస్తుత తరంలో.. మన ఆహార వనరులకు సంబంధించిన మూలాలను ఈ తరానికి తెలియజేప్పేలా చేస్తే.. అదీ వారికి నచ్చే రీతిలో.. వీడియో గేమ్ ఆడినట్లు సరదా సరదాగా విజ్ఞానం కలిగిస్తే.. చైనాకు చెందిన డిజైనర్ పాన్ వాంగ్ అదే చేసింది. ‘ఫ్యూచర్ హంటర్ గేదరర్’ అనే ఈ కాన్సెప్ట్‌ను డిజైన్ చేసింది. ఇంత వినూత్నంగా ఉంది కాబట్టే.. దీనికి ప్రతిష్టాత్మక ఎలక్ట్రోలక్స్ డిజైన్ ల్యాబ్-2014 పురస్కారం వరించింది.
ఎలా పనిచేస్తుంది?
వృత్తాకారంలో ఉండే ఈ పరికరాన్ని నొక్కితే.. మొబైల్ ద్వారా లింక్ అయి ఉన్న స్థానిక సూపర్‌మార్కెట్లోని ఆహార పదార్థాల జాబితా వస్తుంది. మనం చేపలు కావాలని ఎంచుకుంటే.. ఈ పరికరం ప్రొజెక్టర్ తరహాలో పలు రకాల చేపలను ప్రొజెక్ట్ చేస్తుంది. అవి ఇంట్లో తిరుగుతున్నట్లు కదలాడుతుంటాయి. మనకు కావాల్సిన చేపను మనం పట్టుకుంటే.. అది సెలక్ట్ అవుతుంది. సెల్‌ఫోన్‌లో ఆ చేప ప్రత్యక్షమవుతుంది. దాన్ని సెలక్ట్ చేసి.. ఎంటర్ కొడితే.. స్థానిక సూపర్ మార్కెట్‌కు సమాచారం వెళ్లిపోతుంది. వాళ్లు ఆ చేపను ఇంటికి డోర్‌డెలివరీ చేస్తారు. ‘మనకు ఆహార వనరులకు మధ్య సంబంధముండటం లేదు. సూపర్ మార్కెట్‌కు వెళ్లి.. సరుకులు కొనడం సులభమే. అయితే.. అదే సమయంలో అవి ఎక్కడ నుంచి వస్తున్నాయి? వాటి మూలాలేంటి? అన్నదానిపై జనానికి అవగాహన ఉండటం లేదు. అందుకే.. పురాతన కాలంనాటి సంప్రదాయ ఆహార సేకరణ విధానం స్ఫూర్తిగా ఈ కాన్సెప్ట్‌ను రూపొం దించాను. దీనివల్ల పిల్లలు లేదా పెద్దలు ఓ గేమ్ ఆడినట్లు సరదాగా ఉంటుంది. అదే సమయంలో ఆహార వనరులకు సంబంధించిన విజ్ఞానమూ పెరుగుతుంది’ అని పాన్ వాంగ్ చెప్పారు.