అక్రమ నిధులకు అయస్కాంతం | Magnet for illegal funds | Sakshi
Sakshi News home page

అక్రమ నిధులకు అయస్కాంతం

Published Wed, Apr 6 2016 3:26 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

అక్రమ నిధులకు అయస్కాంతం

అక్రమ నిధులకు అయస్కాంతం

పనామా సిటీ: అటు పసిఫిక్... ఇటు అట్లాంటిక్. ఆ రెండింటినీ కలిపే పనామా కాలువ  చుట్టూ విస్తరించిన కరీబియన్ దేశం. దశాబ్ద కాలంగా ఈ దేశం సగటున 8.5% వృద్ధిని సాధిస్తోంది. దేశ జీడీపీలో80 శాతం వచ్చేది సర్వీసులపైనే. వాటిలోనూ ఆగ్రస్థానం బ్యాంకింగ్, బీమా, పర్యాటకాలదే. దీన్ని బట్టే ఇక్కడికి విదేశీ డబ్బు ఎంత వస్తోందో, ఎలా వస్తోందో ఒక అంచనాకు రావచ్చు. నిజానికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ స్థాయి వృద్ధిని సాధించలేకపోతున్నాయి. విదేశాలనుంచి ప్రముఖుల డబ్బు వరదలా వెల్లువెత్తడంతో పనామా సిటీ లాటిన్ అమెరికా దేశాల దుబాయ్‌గా మారిపోయింది. అసలిన్ని నిధులు పనామాకు ఎలా వస్తున్నాయ్? ఎప్పటి నుంచి ఈ దేశం ఇలాంటి ‘అక్రమ’ కార్యక్రమాలకు కేంద్రమైంది?

 1980ల్లోనే మొదలు...
 పనామాలో ఇలాంటి పరిస్థితులు కొత్తకాదు. 1980ల్లోనే ఇది మనీ లాండరింగ్‌కు కేంద్రం. అప్పటి నియంత జనరల్ మాన్యుల్ నోరెగా.. కొలంబియా డ్రగ్ ఉత్పతిదారులకు ఎర్రతివాచీతో స్వాగతం పలికాడు. అప్పటినుంచి అక్రమ డబ్బుకు ఇదో అయస్కాంతంగా మారిపోయింది. డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కావడంతో ఆర్జించిన సొమ్మును డాలర్లలో దాచుకునే వెసులుబాటుంది. ఇక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థయిన అమెరికాకు చేరువలో ఉండడం కూడా పనామాకు కలిసొచ్చింది. అలాగని ఇక్కడున్న కంపెనీలన్నీ ‘అక్రమ’ కేంద్రాలు కావు. న్యాయబద్ధంగా నడుస్తున్న కంపెనీలూ పనామాలో ఉన్నాయి.

 అమెరికా 3.. పనామా 13
 నిజానికి షెల్ కంపెనీలకు పనామా ఒక్కటే కేంద్రం కాదు. పన్నులు తక్కువగా ఉన్న పలు దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ‘ద వాచ్ డాగ్ గ్రూప్’ వెల్లడించిన ఫైనాన్షియల్ సీక్రెసీ సూచీలో అమెరికా 3వ స్థానంలో ఉండగా పనామా స్థానం 13. లండన్‌లోని ట్యాక్స్ జస్టిస్ నెట్‌వర్క్ అంచనా ప్రకారం...  ప్రపంచవ్యాప్తంగా 21 ట్రిలియన్ డాలర్ల (రూ.138 కోట్ల కోట్లు) నుంచి 32 ట్రిలియన్ డాలర్ల (రూ.210 కోట్ల కోట్లు) పన్ను ఎగవేసిన లేదా స్వల్పంగా పన్ను చెల్లించిన సంపద ఉన్నట్లు తెలుస్తోంది.

2014లో ‘గ్లోబల్ షెల్ గేమ్స్’ పేరిట కొందరు ఆర్థిక వేత్తలు విడుదల చేసిన పుస్తకంలో పన్నులు ఎగవేసే వారికి ఆశ్రయమిచ్చే దేశాలు, షెల్ కంపెనీల ఏర్పాటుకు 182 అనువైన ప్రాంతాలు, ఇందుకు సహకరించే 3700 కార్పొరేట్ సర్వీస్ ప్రొవైడర్ల గురించి సవివరంగా పేర్కొన్నారు. ఈ పుస్తకంలో వివరాలు దిమ్మతిరిగే వాస్తవాలను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇలాంటి అక్రమ కంపెనీల్లో పనామా వాటా 29 శాతం. ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఫొటో గుర్తింపుకార్డు, కంపెనీ యజమానిగా గుర్తించేందుకు కావాల్సిన ఇతర పత్రాలుంటే చాలు. ఇట్టే కంపెనీకి డెరైక్టర్ అయిపోవచ్చు. ఇలాంటి కంపెనీల్లో 25 శాతానికి అమెరికా, 6 శాతానికి డెలావర్ ఆశ్రయమిస్తున్నాయి.

 నిష్పాక్షిక విచారణ
 పనామా పేపర్స్ లీకేజీ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపనున్నట్లు తెలిపింది. దేశ, విదేశాల్లోని మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ ఘటనలో జరిగిన తప్పొప్పుల విచారణకు ప్రభుత్వం తరపున కావాల్సిన సహాయసహకారాలు అందుతాయని పనామా అధ్యక్షుడు జువాన్ కార్లోస్ వరేలా తెలిపారు. పనామా ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏ పనినీ ఉపేక్షించబోమన్నారు. మనీ లాండరింగ్ కేంద్రం అనే ముద్ర వేయటం సరికాదన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టినవారంతా అక్రమార్కులు కారన్నారు.
 
 హవ్వ! ఇంత జరుగుతుందా?
 పనామా పేపర్స్ లీక్ నేపథ్యంలో ప్రపంచం ముక్కున వేలేసుకుంటే.. పనామా ప్రజలూ ఆశ్చర్యపోతున్నారు. తమ దేశం ఇన్నాళ్లూ పన్ను ఎగవేతదారులు, అవినీతి తిమింగలాలు, డ్రగ్ డీలర్లకు స్వర్గధామంగా మారిన సంగతి తమకు తెలియదనే చెబుతున్నారు. మొసాక్ ఫోన్సెకా కంపెనీ సహ వ్యవస్థాపకుడు రొమాన్ ఫోన్సెకా మాట్లాడుతూ... ఆర్థికమాంద్యం నేథ్యంలో ధనవంతులు పనామాకు రావటం తట్టుకోలేక కొందరు కావాలనే ఈ పత్రాలను విడుదల చేశారని, ఇది అన్యాయమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement