మాలేలో మోహరించిన భద్రతా బలగాలు
కొలంబో/మాలే: తమ దేశంలో రాజకీయ సంక్షోభానికి తెరదించేం దుకు భారత్ తన సైన్యాన్ని పంపించి సాయం చేయాలని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ కోరారు. మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ సుప్రీంకోర్టు గత గురువారం తీర్పునివ్వడం.. దాన్ని పాటించేందుకు యమీన్ విముఖత చూపుతుండటం తెలిసిందే. సోమవారం యమీన్ మాల్దీవుల్లో అత్యవసర స్థితిని కూడా విధించారు.
ఈ నేపథ్యంలో మంగళవారం నషీద్ స్పందిస్తూ.. ‘భారత్ తన రాయబారిని, సైన్యాన్ని మా దేశానికి పంపించి పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నాను. మాల్దీవుల్లో అత్యవసర స్థితిని ప్రకటించడం సైనిక పాలనను ప్రవేశపెట్టడం వంటిదే. ఇది రాజ్యాంగవిరుద్ధం, అక్రమం. సంక్షోభానికి తెరదించాల్సిందిగా ప్రజలు ప్రపంచ దేశాలను.. ప్రత్యేకించి భారత్, అమెరికాలను కోరుతున్నారు’ అని ట్వీటర్‌లో పేర్కొన్నారు.
ఇద్దరు జడ్జీల అరెస్టు: మాల్దీవుల్లో అత్యవసర స్థితిని విధించిన కొన్ని గంటలకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్, మరో జడ్జి అలీ హమీద్‌లను యమీన్ అరెస్ట్ చేయించారు. వారిపై ఏ అభియోగాలు మోపారు?, ఎలా విచారిస్తున్నారన్న విషయాలను బయటపెట్టలేదు. మరో మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్‌ను కూడా గృహనిర్బంధంలో ఉంచారు. న్యాయమూర్తులు తనను పదవి నుంచి దించేయడానికి కుట్ర పన్నారని యమీన్ ఆరోపించారు.
కలత చెందాం: మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి విధించడంతో తాము కలత చెందామని భారత్ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తిని అరెస్టు చేయించడం ఆందోళనకరమంది. మాల్దీవులకు సాయం చేసే విషయంలో భారత్ నిర్దిష్ట కార్యాచరణ విధానాన్ని అనుసరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ భారతంలోని ఓ కీలక వైమానిక స్థావరం వద్ద భారీ సంఖ్యలో సైనికులున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment