రేప్ అనంతరం సారీ అంటూ మెసేజ్..
డెర్బి: ఆన్లైన్ డేటింగ్ సైట్లో పరిచయమైన ఐదుగురు మహిళలను ఓ వ్యక్తి రేప్ చేశాడు. ఆరో మహిళపై సైతం లైంగిక దాడికి ప్రయత్నించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌లోని డెర్బీ ప్రాంతానికి చెందిన జాసన్ లారెన్స్(50).. ప్రముఖ డేటింగ్ వెబ్ సైట్ మ్యాచ్ డాట్ కామ్లో వేరు వేరు ప్రొఫైల్స్తో అమాయక మహిళలకు వల వేశాడు. తనతో సంభాషణలు ప్రైవేట్ మెయిల్ లేదా ఫోన్ ద్వారా చేయాలని డేటింగ్ వెబ్సైట్ ద్వారా పరిచయం అయిన మహిళలను కోరేవాడు. అలా తనతో ప్రైవేటు సంభాషణలు జరిపిన వారిని కలుసుకొని వారిపై లైంగిక దాడి పాల్పడ్డాడు. వ్యక్తిగత సంభాషణల ద్వారా తన నిజస్వరూపాన్ని మ్యాచ్ డాట్ కామ్ సైటు దృష్టిలో పడకుండా జాసన్ జాగ్రత్త పడ్డాడని ప్రాసిక్యూటర్ షాన్ స్మిత్ తెలిపారు.
మూడు మిలియన్ల సభ్యులతో మ్యాచ్ డాట్ కామ్కు బ్రిటన్‌లో అతి పెద్ద డేటింగ్ సైటుగా పేరుంది. ఈ సైట్ ద్వారా మొదటగా 2013 నవంబర్‌లో పరిచయమైన ఓ మహిళను జాసన్ తన ఇంట్లోనే రేప్ చేశాడు. ఇక మరో ఘటనలో తనను కలుసుకోవడానికి వచ్చిన మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇలా రేప్లు చేసిన అనంతరం తాపీగా క్షమించమని మెసేజ్లు పెట్టడం జాసన్కున్న మరో అలవాటు. డెర్బీ క్రౌన్ కోర్టులో జాసన్ అకృత్యాలపై విచారణ జరుగుతోంది.