విమానం నుంచి దూకేశాడు..
నార్త్ కరోలినా: విమానం నుంచి దూకి ఓ వ్యక్తి విమానశ్రయ సిబ్బందికి ఆగ్రహం తెప్పించాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ టేకాఫ్‌కు సిద్దంగా ఉన్న విమానం నుంచి ఆకస్మాత్తుగా దూకేశాడు. ఈ ఘటన అమెరికాలోని ఉత్తర కరోలినా, షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానశ్రయంలో చోటుచేసుకుంది. టున్ లోన్ సేన్ అనే 22 ఏళ్ల అమెరికా యువకుడు డగ్లన్ విమానశ్రయంలో5242 అమెరికన్ ఎయిర్‌లైన్ ఫ్లైట్ ఎక్కాడు.
విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో ఒక్కసారిగా అతని సీటు నుంచి లేచి విమాన ప్రధాన డోర్‌ను తీయడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన విమాన సిబ్బంది అతన్ని కూర్చోమని హెచ్చరించారు. అయినా సేన్ వినకపోవడంతో అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై చేయి చేసుకున్నాడు. డోర్ తీసి దూకి పారిపోయే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఫేడరల్ కోర్టులో కేసు నమోదు అయ్యింది. అయితే సేన్ ఎందుకు దూకాడన్న విషయం మాత్రం తెలియలేదు.