
పంటితో అమ్మాయిని పడగొట్టాడు
సాధారణంగా ఏ అబ్బాయైనా తను ప్రేమించిన అమ్మాయికి గోల్డ్ రింగ్ తోనో.. ప్రేమతో పాటు డబ్బు కూడా ఎక్కువ ఉంటే డైమండ్ రింగ్ తోనో ప్రపోజ్ చేస్తాడు. అందుకు భిన్నంగా ఓ యువకుడు తన పంటితో ప్రపోజ్ చేసి ఆమెను ఆశ్చర్యపరిచాడు. పంటితోనా! ఎలాగెలాగా అంటారా.. ఉంగరంలో ఏ రత్నమో, పగడమో, వజ్రమో ఉంగాల్సిన చోట తన జ్ఞానదంతాన్ని పొదిగాడు కాలిఫోర్నియాకు చెందిన ఆ వినూత్న ప్రేమికుడు. లూకాస్ ఉంగర్ అనే ఆ యువకుడికి కార్లీ లిఫ్కెస్ అనే చిన్నది ఈ ఏడాది ప్రారంభంలో కెనడాలోని ఓ మ్యూజిక్ ఫెస్టివల్లో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా చిగురించి.. ఆపై ప్రేమగా విరబూసింది.
దాంతో పెద్దలు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. అదే రోజు కార్లీ కుటుంబ సభ్యులందరు చూస్తుండగా ఆమె ఎదురుగా మోకాలిపై కూర్చొని 'నన్ను పెళ్లి చేసుకుంటావా' అంటూ జ్ఞానదంతం అమర్చిన రింగ్ తొడిగి లూకాస్ ప్రపోజ్ చేశాడు. నవ్వుతూ ఒప్పేసుకుంది క్లారీ. నా ఆప్త మిత్రుడిని వివాహం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని కార్లీ ఫేస్ బుక్ పేజీలో పేర్కొంది. అతని జ్ఞానదంతంతో చేసి ఇచ్చిన ఉంగరం డైమండ్ రింగ్ కన్నా విలువైందని చెబుతోంది. వీరిద్దరూ నవంబర్ 21న లాస్వెగాస్లో పెళ్లి చేసుకుంటారు.