మంచుతో కప్పబడిన ప్రాంతం
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా మంచు తుపాన్ (నార్ ఈస్టర్) ధాటికి వణికిపోతోంది. కేవలం ఒక వారంలోనే సంభవించిన రెండు మంచు తుపాన్‌ల తీవ్రతకు అమెరికాలోని ఈశాన్య ప్రాంతం మంచు దుప్పటిలా మారింది. తుపాన్‌ల వల్ల విద్యుత్తుకు తీవ్ర అంతరాయం కలగడంతో సుమారు 10 లక్షల మంది ప్రజలు జీవితాన్ని అంధకారంలోనే వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా న్యూజెర్సీ, మసాచుసెట్స్, న్యూహంప్‌షైర్, పెన్సుల్వేనియా ప్రాంతాలు మంచు తుపాన్ ప్రభావానికి గురయ్యాయని అక్కడి అధికారులు తెలిపారు. తూర్పు తీరంలోని ఎగువభాగాన్ని బుధవారం మంచు తుపాన్ తాకడంతో న్యూ ఇంగ్లండ్ ప్రాంతం మంచు యుగంలా మారిందని వారు వెల్లడించారు. ముఖ్యంగా గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.
మసాచుసెట్స్ రాష్ట్రంలోని 2.50 లక్షల మంది గురువారం మధ్యాహ్నం వరకు విద్యుత్తు అంతరాయానికి గురయ్యారని తెలిపారు. మరికొన్ని రోజులు విద్యుత్ సమస్య ఉంటుందని, ప్రజలు తదనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్తు అధికారులు సూచించారు. విద్యుత్తును తిరిగి పునరుద్ధరించడానికి వందలాది మంది ఇంజనీర్లను రంగంలోకి దింపామని విద్యుత్ శాఖ పేర్కొంది. ఒక్క న్యూజెర్సీలోనే వివిధ గృహాలు, కంపెనీల నుంచి 3.20 లక్షల ఫిర్యాదులు అందాయని వారు చెప్పారు. మరోవైపు తీవ్ర ప్రతికూల వాతావరణం కారణంగా 2,700 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 2,400 విమానాలు ఆలస్యంగా నడిచాయి.
Comments
Please login to add a commentAdd a comment