గుండె వేగాన్ని కొలిచే రబ్బర్‌బ్యాండ్
లండన్: మీ చేతికి ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది.. అది మీ గుండె కొట్టుకునే వేగాన్ని, ఊపిరి తీసుకునే విధానాన్ని చెప్పేస్తుంది.. అంతేకాదు మీ శరీర కదలికలను కూడా గుర్తిస్తుంది. ఇదేమిటి అంటారా? సాధారణ రబ్బర్‌బ్యాండ్ తరహాలోనే ‘గ్రాఫీన్ (కార్బన్ మూలకం)’ను చేర్చి రూపొందించిన సరికొత్త రబ్బర్‌బ్యాండ్‌లు ఇవి. సర్రే యూనివర్సిటీ, డబ్లిన్ ట్రినిటీ కాలేజీ పరిశోధకులు దీనిని రూపొందించారు. సాధారణంగా గుండెపోటుతోనో, ఏదైనా వ్యాధితోనో బాధపడుతున్న వారికి తరచూ గుండె కొట్టుకునే వేగాన్ని, శ్వాసక్రియను, శరీర కదలికలను పరిశీలించాల్సి ఉంటుంది.
మరి అందుకోసం చాలా రకాల పరికరాలున్నాయి. కానీ అవన్నీ చాలా ఖరీదైనవి, పరిమాణంలోనూ పెద్దగా ఉంటాయి.. దాంతో పాటు వినియోగించే విధానమూ కొంత కష్టమే. దీనిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. సాధారణ ప్లాస్టిక్‌కు గ్రాఫీన్‌ను చేర్చి ‘ఎలక్ట్రోమెకానికల్’ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. దీనిని సెన్సర్‌గా వినియోగించుకుని గుండె కొట్టుకునే వేగాన్ని, ఊపిరి తీసుకునే వేగాన్ని, కీళ్లు, కండరాలు వంటి శారీరక కదలికలను సులువుగా గుర్తించవచ్చని.. ఇది చాలా చవక అని వారు చెబుతున్నారు.