
ఏడాదైనా 'జాడ'లేదు
కౌలాలంపూర్: సరిగ్గా ఏడాది కిందట.. మార్చి 8వ తేదీ అర్ధరాత్రి మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి బయల్దేరింది ఎంహెచ్370 విమానం. అందులో 12 మంది విమాన సిబ్బంది, ఐదుగురు భారతీయులు సహా 227 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ఉదయం 6:30 గంటలకు చైనా రాజధాని బీజింగ్‌కు చేరుకోవాలి. కానీ.. విమానం బయల్దేరిన అరగంటకే కంట్రోల్ సెంటర్లతో సంబంధాలు నిలిచిపోయాయి. మరి కాసేపటికే రాడార్ నుంచి అదృశ్యమైపోయింది. ఆదివారం నాటికి ఏడాది పూర్తవుతుంది. ఏడాదిగా ఈ విమానం జాడ దొరకలేదు. అందులోని వారు ఏమైపోయారో తెలియలేదు. ఈ బోయింగ్ 777 విమానం ఆచూకీ కోసం ప్రపంచ చరిత్రలో అతిపెద్ద గాలింపు కొనసాగుతోంది. ఏడాది కాలంగా మహాసముద్రాన్ని జల్లెడ పడుతున్నారు. కానీ.. విమానం జాడ మాత్రం లభించటం లేదు. మే నెలాఖరుకల్లా ఈ గాలింపు పూర్తవుతుందని.. అప్పటికల్లా విమానం జాడ లభిస్తుందని మలేసియా ప్రభుత్వం ఆశాభావం వ్యక్తంచేస్తోంది.
ఎలా మాయమైంది?..
ఎంహెచ్370 విమానం దక్షిణచైనా సముద్రం నుంచి వియత్నాం గగనతలం మీదుగా చైనా దిశగా ప్రయాణించాల్సి ఉంది. కానీ.. బయల్దేరిన విమానం దక్షిణ చైనా సముద్రంలోకి వెళ్లి వియత్నాం గగనతలంలోకి ప్రవేశించకుండానే 1:22 గంటలకు యూ-టర్న్ తీసుకుని మళ్లీ మలేసియా మీదుగా అండమాన్ సముద్రం వైపు ప్రయాణించినట్లు సైనిక రాడార్‌లో నమోదైంది. ఉదయం 2:20 గంటల వరకూ సైనిక రాడార్‌పై కనిపించిన విమానం ఆ తర్వాత దాని నుంచీ మాయమైపోయింది. అయితే.. ఆ విమానం 4గంటల పాటు దక్షిణ హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించిందని.. దాని నుంచి ఇన్‌మార్‌సాట్ ఉపగ్రహానికి అందిన సంకేతాల ఆధారంగా గుర్తించారు. ఉదయం 8:19 నిమిషాలకు చివరిసారిగా ఈ విమానం నుంచి ఉపగ్రహానికి సంకేతాలు అందాయి. ఆ తర్వాత ఎటువంటి సంకేతాలూ లేవు.
గాలింపు జరుగుతోందిలా...
విమానం అదృశ్యమైన తర్వాత ఆగ్నేయాసియాలో దక్షిణ చైనా సముద్రం, వియత్నాం దక్షిణ ప్రాంతంలో 14 దేశాలు కొన్ని రోజులు గాలింపు నిర్వహించారు. కానీ ఫలితం లేకపోయింది. మరుసటి వారానికి.. సైనిక రాడార్ అందించిన సమాచారం, ఉపగ్రహం నుంచి లభించిన సమాచారాన్ని విశ్లేషించి.. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు పశ్చిమ దిశగా ఈ విమానం కూలిపోయి ఉంటుందన్న నిర్ధారణకు వచ్చారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకూ 46 లక్షల చదరపు కిలోమీటర్ల మేర.. సముద్ర ఉపరితలంపై గాలింపు నిర్వహించారు. ఇందులో 40 నౌకలు, 34 విమానాలను వినియోగించారు. ఆ తర్వాత మే నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 17 వరకూ మొత్తం 20 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో సర్వే నిర్వహించారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి సముద్ర గర్భంలో సైతం గాలింపు చేపట్టారు.
ఈ సముద్రం కొన్నిచోట్ల ఆరు కిలోమీటర్ల వరకూ లోతు ఉండటం గమనార్హం. సైడ్ స్కాన్ సోనార్లు, మల్టీ-బీమ్ ఎకో సౌండర్లు, వీడియో కెమెరాలు, అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ వంటి అత్యాధునిక గాలింపు పరికరాలతో నిర్దేశించుకున్న ప్రాంతంలో ప్రతి చదరపు అడుగునూ పరిశీలిస్తూ ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సముద్రగర్భంలో మొత్తం 60,000 చదరపు కిలోమీటర్ల ప్రధాన గాలింపు ప్రాంతంలో ఇప్పటివరకూ 26,000 చదరపు కిలోమీటర్ల మేర గాలింపు పూర్తిచేశారు. ఈ గాలింపులో మలేసియాకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, సింగపూర్, ఇండొనేసియా, ఆస్ట్రేలియాలు సహకారం అందిస్తున్నాయి.
'అదృశ్యం'పై అంచనాలివీ..
విమానం.. బయల్దేరిన అరగంటకే వెనుదిరిగి హిందూ మహాసముద్రం దిశగా ప్రయాణించటం.. అదీ ‘ఆటో పైలట్’ మోడ్‌లో వెళ్తూ ఇంధనం అయిపోయాక సముద్రంలో కూలిపోయివుంటుందని భావిస్తున్నారు. ఈ భారీ బోయింగ్ 777 అదృశ్యానికి కారణాలపై వైమానిక నిపుణులు అనేక కోణా ల్లో పరిశీలించి పలు అంచనాలకు వచ్చారు. అందులో ప్రధానమైనది.. విమానం పైలట్లలో ఒకరు ఉద్దేశపూర్వకంగానే దారిమళ్లించారనేది. విమానం కెప్టెన్ జహారీ అహ్మద్ షా కుటుంబ కలహాలతో తీవ్రంగా కలతచెంది ఉన్నాడని.. ఆయన సహచరులు కొందరు చెప్పటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అసలు కార ణం బ్లాక్ బాక్స్ లభ్యమైతే కానీ తెలియకపోవచ్చు.
మలేసియా ఏం చెప్తోంది..
విమానం అదృశ్యాన్ని విమాన ప్రమాదంగా పరిగణిస్తున్నామని.. అందులో ప్రయాణిస్తున్న వారెవరూ జీవించి ఉండే అవకాశం లేదని భావిస్తున్నామని మలేసియా సర్కారు ఇటీవల అధికారికంగా ప్రకటించింది. విమానం ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని.. వచ్చే మే నెలకల్లా ప్రస్తుత గాలింపు పూర్తవుతుందని మలేసియా రవాణామంత్రి లియో టియాంగ్ శుక్రవారం మీడియాతో పేర్కొన్నారు. అప్పటికల్లా విమానం ఆచూకీ కనుగొంటామన్న ఆశాభావం వ్యక్తంచేశారు.