దండం పెట్టాడు.. దండన తప్పించుకున్నాడు | Moped Rider Begs for Mercy as Angry Elephants Charge at him in Thailand | Sakshi
Sakshi News home page

దండం పెట్టాడు.. దండన తప్పించుకున్నాడు

Published Fri, Oct 23 2015 6:57 PM | Last Updated on Mon, Apr 8 2019 8:11 PM

Moped Rider Begs for Mercy as Angry Elephants Charge at him in Thailand

పాక్ చాంగ్: మొసలికి చిక్కి, శరణన్న ఏనుగును.. హుటాహుటిన వచ్చి కాపాడతాడు విష్ణుమూర్తి.. గజేంద్ర మోక్షంలో. మరి, గజేంద్రులే భీకరంగా ఘీంకరిస్తూ మృత్యుదేవతల్లా మీదికొస్తే! ఏ దేవుడు కాపాడతాడు? పాశ్చాత్య దేశాల్లోనైతే ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు. అదే ఆసియాలో.. అందునా భారత్ కు అతి సమీపాన ఉన్న థాయిలాండ్ లోనైతే ఐడియా ఇట్టే తడుతుంది!

కోపంగా తన మీదికి దూసుకొచ్చిన ఏనుగుల గుంపునకు భక్తితో (నిజానికి భయంతో) దండాలు పెట్టి తప్పించుకున్నాడో ధన్యుడు. ధాయిలాండ్ లోని ప్రఖ్యాత ఖావో యై నేషనల్ పార్కులో చోటుచేసుకున్న ఈ సంఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అసలేం జరిగిందంటే

దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఖావో పార్కులో వందలాది జంతువులు ఆశ్రయం పొందుతున్నాయి. పార్క్ లోనే 50 కిలోమీటర్ల పరిధిలోని సఫారీలో సందర్శకులు.. బైకులు, కార్లలో వెళ్లి ఎంచక్కా జంతువుల్ని ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాటుచేశారు నిర్వాహకులు. అలా బైకెక్కి పార్కులో తిరుగుతున్న ఓ వ్యక్తిని ఏనుగుల గుంపు అడ్డగించింది. కోపంగా అతని వైపు దూసుకొచ్చింది. నిలువెల్లా వణికిపోయిన ఆ రైడర్.. చేతులు జోడించి ఏనుగుల గుంపునకు దండాలు పెట్టాడు. 'నన్నేమీ చెయ్యొద్ద'ని వేడుకున్నాడు. అతడి 'భయ'భక్తికి మెచ్చిన ఏనుగులు రైడర్ ను ప్రాణాలతో వదిలేసి వెళ్లిపోయాయి.

అదే రోడ్డుపై నిలిచి ఉన్న మరో కారు కెమెరాలో ఈ దృశ్యాలలు రికార్డయ్యాయి. సదరు రైడర్ రావడానికి ముందు.. కొన్ని బైకులపై వచ్చిన ఆకతాయిలు కొందరు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగులను చిరాకు పెట్టారట! అసహనానికి గురికావటం వల్లే  ఏనుగులు రైడర్ వైపు దూసుకెళ్లాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఉదంతంతో ఖావో పార్క్ లో బైకులు, కార్లను నిషేధించాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement