పాట్నా: పార్లమెంట్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా రాజకీయ పార్టీల నినాదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తమ విధానాలను ప్రతిబింబించే విధంగానే కాకుండా ఓటర్లను ఆకర్శంచే విధంగా, ఓ రితమిక్‌గా నినాదాలు ఉండాలని ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో ప్రయత్నిస్తుంది. బీహార్ ఎన్నికలు వచ్చే నెలలో జరుగనున్న నేపథ్యంలో పాలకపక్ష జేడీయు, విపక్ష భారతీయ జనతా పార్టీల కొత్త నినాదాలతో ముందుకొస్తున్నాయి.
‘బదలియే సర్కార్, బదలియే బీహార్’ (ప్రభుత్వాన్ని మార్చండి, బీహార్‌ను మార్చండి) అనే నినాదాన్ని బీజేపీ అందుకోగా, ‘బహుత్ హుహా జుమ్లోం కా వార్, అబ్కీ బార్ నితీష్ సర్కార్ (బూటకపు హామీలు ఎక్కువయ్యాయి, నితీష్ ప్రభుత్వానికి ఓటేయండి), మహిళోం కో సురక్షా ఔర్ అధికార్, ఫిర్ ఎక్‌బార్ నితీష్ కుమార్’ (మహిళలకు భద్రత, అధికారం...నితీష్ కుమార్‌కు మరోసారి ఓటేయండి) అనే నినాదాలతో జేడీయూ ముందుకొచ్చింది. ఇరు పార్టీల వారు నినాదాల బ్యానర్లతో బీహార్ వీధులను నింపేశారు.
అమెరికా లాంటి అగ్ర దేశాల్లోనే కాకుండా భారత రాజకీయాల్లో, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో నినాదాల ప్రభావం అంతా ఇంతా కాదు. 1971లో ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆవిడిచ్చిన నినాదం ‘గరీబీ హఠావో’ ఓటర్లను ఎంతో ప్రభావితం చేసింది. అలాగే ‘ఇందిరా హఠావో, దేశ్ బచావో’ అంటూ జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన నినాదం 1977 ఎన్నికల్లో సంచలనమే సృష్టించింది. 1996లో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చినపుపడు ‘బారీ బారీ సబ్కీ బారీ, అబ్కీ బారీ అటల్ బిహారి’ అనే నినాదం కూడా కొంత మేరకు ఓటర్లను ప్రభావితం చేసింది. ‘అబ్కీ బారీ నరేంద్ర మోదీ’ అనే నినాదం కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఎన్నికలతో సంబంధం లేకుండా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1950లో ఇచ్చిన ‘హిందీ-చీని భాయి, భాయి’, ఆయన వారసుడు లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్’ అంటూ ఇచ్చిన నినాదాలు భారత రాజకీయాలపై ఎంతో ప్రభావం చూపించాయి.
ఎన్నికలపై నినాదాల ప్రభావం
Published Thu, Sep 24 2015 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM
Advertisement
Advertisement