మాస్కో: రకరకాల ఫీట్లతో చాలామంది ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో కొంతమంది ఆశ్చర్యపోయేలా ఫీట్లు చేస్తే మరికొందరు ఔరా అనిపిస్తారు. ఇంకొందరు మాత్రం మహాద్భుతం ఇంత గొప్పగా చేయడం ఎవరివల్ల కాదు అని అనుకునేలా చేస్తారు. కానీ, రష్యాకు చెందిన ఒలెగ్ షెర్‌స్టీయాకెంకో అనే ఓ డేర్ డెవిల్ ఫీటర్.. మాత్రం ఇతడికేం పోయే కాలమా అన్నట్లుగా సాహసాలు చేశాడు. అత్యంత ఎత్తైన ఆకాశ హార్మ్యాలపై సాధారణం నిల్చుని కిందికి చూడటమే అరుదు.. దాని మీద నడవగలగడం గుండెలు జారిపడే సాహసం అలాంటిది.. ఏకంగా కోతి గంతులు వేస్తే, అదీకాకుండా ఆ అంచులపై శీర్షాసనం వేయగలిగితే దానికి ఇక ఏ పేరు పెట్టాలి.
ఒలెగ్ మాత్రం అలాగే చేశాడు. రష్యాకు చెందిన ఇతగాడు పెద్ద పెద్ద భవన అంచులపై కుప్పిగంతులు వేయడంతోపాటు సైకిల్‌తో సవారీలు చేశాడు. నేరుగా దాని అంచుపై తలకిందులుగా శీర్షాసనం వేసి ఒళ్లుగగుర్పొడిచేలా చేశాడు. ఇప్పటికే ఈతడు ఇలాంటివి ఎన్నో చేసినప్పటికీ ఇది మాత్రం వాటన్నింటికంటే కూడా చాలా భయంకరమైన ఫీట్.. దీనిని చూస్తున్నవారెవ్వరికైనా దాదాపు గుండె ఆగినంత పనై పోతుంది. కొంతమంది అతడి సాహసాన్ని మెచ్చుకుంటుండగా ఇంకొందరు మాత్రం జీవితంపట్ల ఎందుకంత నిర్లక్ష్యం అంటూ చురకలంటించారు. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది.