ఫేస్ బుక్లో మునిగిన తల్లికి ఐదేళ్ల జైలు
బేవెర్లీ: కొడుకు ఆలనా పాలనా చూడకుండా ఫేస్ బుక్లో మునిగిపోయిన తల్లికి, బ్రిటన్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. తల్లి అలసత్వం కారణంగానే ఆమె రెండేళ్ల కుమారుడు నీటిలో పడి మృతి చెందాడని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
వివరాలు.. జోషువా బార్నెట్ (2), 2014 మార్చి14న తూర్పు యార్క్ షైర్, బెవెర్లీలోని తమ ఇంట్లో గార్డెన్ లో ఆడుకుంటుండగా అనుకోకుండా స్విమ్మింగ్ పూల్లోని నీళ్లలో పడ్డాడు. ఆ సమయంలో బాలుడు తల్లి క్లెయిర్ బార్నెట్(31) ఫోన్ లో ఫేస్ బుక్ తో బిజీగా ఉంది. బాలుడిని కొద్దిసేపటి తర్వాత గమనించి ఆస్పత్రికి తీసకెళ్లినా అప్పటికే ఆలస్యం అవ్వడంతో ఆ పిల్లాడు మరణించాడు.
2013లో ఒకసారి ఇదే పిల్లాడు అదే తల్లి అలసత్వం కారణంగా ప్రాణాలు కోల్పోబోయి.. తృటిలో తప్పించుకున్నాడు. వాళ్లు హల్ ప్రాంతంలో నివసించే సమయంలో ఆ పిల్లాడు రోడ్డు మీదకు వచ్చాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు ఆ బాలున్ని కొట్టబోయింది. డ్రైవర్ చివరి నిమిషంలో తప్పించాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు.. పిల్లల కోసం ఏర్పాటచేసిన స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించడంతో, ఆ తల్లిపై పోలీస్ స్టేషన్ లో నాలుగు కేసులు నమోదు చేశారు. ఆ సమయంలో బాలుడి విషయంలో అలసత్వం చూపడంపై వచ్చిన నాలుగు ఆరోపణలను క్లెయిర్ బార్నెట్ అంగీకరించింది.
ఇప్పుడు అదే బాలుడు నీటిలో పడ్డ సమయంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు పోంతన లేని సమాధానాలు చెప్పింది. విచారణలో ఆమె ఫేస్ బుక్ చూడటంలో బిజీగా ఉన్నట్టు తేలింది. చివరికి పాత ఘటనను కూడా పరిగణనలోకి తీసుకొని.. కోర్టు క్లెయిర్ బార్నెట్ కి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.