ఆరోహి పండిట్
‘మగాళ్లు చేస్తున్నారు.. మరి మహిళలెందుకు చేయలేరు?’ అని తన మదిలో మెదిలిన ప్రశ్న ఓ యువతిని ఉన్నత స్థానంలో నిలపింది. ఆ ప్రశ్నే ఆమెతో ప్రపంచ రికార్డు నమోదు చేసేలా చేసింది. ముంబైకి చెందిన 23 ఏళ్ల ఆరోహి పండిట్.. ఒక్కతే అల్ట్రా లైట్ ఎయిర్ క్రాఫ్ట్‌లో అట్లాంటిక్ మహాసముద్రం చుట్టొచ్చి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆరోహి గుర్తింపు పొందింది. చిన్న పిట్టకు పెద్ద రెక్కలు ఉన్నట్లు ఉండే ఎయిర్‌క్రాఫ్ట్‌లో బలమైన గాలుల మధ్య సాహసోపేతంగా 3వేల కిలోమీటర్లు ప్రయాణించి ఔరా అనిపించింది. 17 ఏళ్ల నుంచే ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడపడం మొదలుపెట్టిన ఆరోహి.. తన అట్లాంటిక్ ప్రయాణాన్ని స్కాట్లాండ్‌లో ప్రారంభించి గత సోమవారమే గ్రీన్‌లాండ్‌లోని నుక్‌లో ముగించింది.
ఈ రికార్డుపై ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘నాకు మహిళలు రికార్డులు సాధించడం కావాలి. కేవలం భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు వారి కలలను నేరవేర్చుకోవాలి. వారికి నేను స్పూర్తిగా నిలవాలి. మగాళ్లు ఈ తరహా రికార్డులు నెలకొల్పడం చూశాను. అప్పుడు నాకనిపించింది మగాళ్లు చేస్తున్నప్పుడు మహిళలు ఎందుకు చేయలేరని? వెంటనే నేను నా కలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాను. మొత్తానికి ఈ ప్రయాణం మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఇదో అహ్లాదకరమైన రైడ్. నా ప్రయాణం చాలా అద్బుతంగా సాగింది. ప్రతి చోట నీలిరంగులోని నీరు.. అహ్లాదకరమైన ఆకాశం. ఎన్నటికి మరిచిపోలేని అద్భుతమైన మదురానుభూతిగా నా ప్రయాణం నిలిచిపోయింది.’ అని ఆరోహి సంతోషం వ్యక్తం చేసింది.
ఆరోహి రైడ్ చేసిన ఎయిర్ క్రాప్ట్ పేరు మహి కాగా.. ఇది సినస్ 912 రకానికి చెందిన లైట్-స్పోర్ట్ ఎయిర్‌క్రాప్ట్. ఒకే ఇంజన్‌తో పనిచేసే ఈ ఎయిర్‌క్రాప్ట్ కేవలం 400 కేజీల బరువు మాత్రం ఉంటుంది. చూడటానికి తెల్లని పిట్టకు పెద్ద రెక్కలు ఉన్నట్లు ఉంటుంది. ఆరోహి భారత్ నుంచి తన రైడ్ ప్రారంభించి.. పాకిస్తాన్, ఇరాన్, టర్కీల మీదుగా ఆగుకుంటూ.. యూరప్ మీదుగా స్కాట్లాండ్ చేరింది. అక్కడి నుంచి తన అట్లాంటిక్ యాత్రను ప్రారంభించి ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్ మీదుగా చివరకు కెనడాలో ల్యాండ్ అయింది. ప్రస్తుతం ఆమె అలస్కా, రష్యాలను చుట్టొచ్చిన అనంతరం ఇంటికి రావాలనుకుంటుంది. ఆమె అనుకున్నట్టుగా జరగాలని ఆరోహికి ఆల్‌దిబెస్ట్ చెబుదాం.
Comments
Please login to add a commentAdd a comment