మాకొక బీచ్ కావాలి...
రాబత్: మొరాకోలోని మహిళలు, ముఖ్యంగా ముస్లిం మహిళలు తమకంటూ ప్రత్యేకమైన బీచ్ కావాలంటూ సామాజిక వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’లో ప్రచారాన్ని మొదలు పెట్టడంతో అక్కడి మగవాళ్లు అగ్గిమీద గుగ్గిళం అవుతున్నారు. ఫేస్‌బుక్‌లోనూ మొరాకో ఫెమినిస్టుల ‘బీచ్’ ప్రచారాన్ని ఉదారవాదులు, సంకుచిత సాంప్రదాయ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం మహిళలు ఎక్స్‌పోజ్ చేయడం అల్లాను ధిక్కరించడమేనని సాంప్రదాయ వాదులు ఆరోపిస్తుండగా, మహిళల కోసం ఓ బీచ్‌ని ప్రత్యేకంగా రిజర్వ్ చేయడమంటే మగవాళ్ల నుంచి మహిళలను వేరుగా చూడడమేనని, ఇది స్త్రీ, పురుష సమాన హక్కులకు భంగం కలిగిస్తోందని ఉదారవాదులు వాదిస్తున్నారు.
రంజాన్ పండుగ తర్వాత మగవాళ్లంతా బీచుల్లో విహరిస్తూ సన్‌బాత్‌లను ఎంజాయ్ చేస్తుంటే ముస్లిం మహిళలు మాత్రం ఎందుకు అలా ఎంజాయ్ చేయకూడదని ప్రముఖ ఫెమినిస్ట్ నూర్ అల్హోదా ఫేస్‌బుక్ ద్వారా ప్రశ్నిస్తున్నారు. స్విమ్ షూట్‌లో సన్‌బాత్ చేసినంత మాత్రాన అల్లాను ధిక్కరించినట్టుకాదని, మగవాళ్ల ముందు అర్థనగ్నంగా సంచరిస్తేనే అల్లాను ధిక్కరించినట్టు అవుతుందని, అందుకనే తాము ముస్లిం మహిళల కోసం ఓ ప్రత్యేక బీచ్ కావాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
మొరాకోలో సముద్ర తీరం వందలాది మైళ్లు విస్తరించి ఉందని, కొంత భాగాన్ని మహిళకు కేటాయిస్తే కొంపలు మునిగేదేమీ లేదని ఫెమినిస్ట్ నూర్‌కు మద్దతుగా మొరాకోలోని కొన్ని మహిళా సంఘాలు వాదిస్తున్నాయి. స్విమ్ షూట్లు ధరిస్తే బీచుల్లో అమ్మాయిలకు భద్రత ఉండదనే సాంప్రదాయవాదులతో ఆ సంఘాలు వాదిస్తున్నాయి. ఇప్పుడు నిండైన దుస్తులు ధరించి వీధిలోకి వెళితే మాత్రం మగవాళ్ల వేధింపులు లేకుండా పోతున్నాయా? అని అంటున్నాయి. పైగా ఇతర మగవాళ్ల నుంచి కన్నా తండ్రీ, తమ్ముడు, అన్న, ఇతర బంధువుల నుంచే తాము ఎక్కువగా వేధింపులను ఎదొర్కోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నాయి.
మొరాకోలో ముస్లిం మహిళల్లో ఆధునికులు యూరప్ దేశాల ప్రభావంతో ఆధునిక దుస్తులు ధరిస్తున్నారు. వీరిపై సంప్రదాయవాదులు కేసులు కూడా పెడుతున్నారు. స్థానిక కోర్టులు ఎలాంటి శిక్షలు విధించకుండా అసభ్య దుస్తులు మాత్రం ధరించవద్దంటూ హెచ్చరికలు చేసి మహిళలను వదిలేస్తున్నాయి. గతంలో ముస్లిం మహిళలు ‘బుర్కినీ’ (నిండైన స్విమ్ షూట్) ధరించడాన్ని అనుమతించేవారు. సాంప్రదాయవాదుల గొడవలతో వాటిపై నిషేధం విధించారు.
టర్కీలోని సరిసు బీచ్‌ను గతేడాది ఆగస్టు నెలలో ‘విమెన్ ఓన్లీ’ బీచ్‌గా ప్రకటించారు. అప్పడు సంప్రదాయ వాదుల నుంచి కన్నా ఉదారవాదుల నుంచి ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. మగవాళ్ల నుంచి మహిళలను వేరు చేస్తున్నారని, ఇది ఐఎస్‌ఐస్ విధానమేనంటూ విరుచుకుపడ్డారు.
.
.