'మా ఆయన రెడీగా ఉన్నారు'
వాషింగ్టన్: అమెరికాకు నాయకత్వం వహించేందుకు తన భర్త తయారుగా ఉన్నారని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియ ట్రంప్ అన్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు. క్లీవ్ లాండ్ లో జరిగిన రిపబ్లికన్ జాతీయ స్థాయి సమావేశంతో అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరును అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా మెలానియ మాట్లాడుతూ... 'గొప్ప దేశానికి నాయకత్వం వహించేందుకు నా భర్త సిద్ధంగా ఉన్నారు. మనకు పిల్లలకు మంచి భవిష్యత్ ఇచ్చేందుకు ప్రతిరోజు పోరాటానికి సన్నద్ధమయ్యారు. ముస్లింలు, ఆసియా వాసులు, పేదలు, మధ్యతరగతి వారితో సహా అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహించాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రాథమిక ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురైనప్పటికీ ఆయన అధ్యక్ష పోటీలో నిలిచారు. ఉత్సుకత, నాటకీయత లేకుంటే మజా ఏముంటుంది. ఈ విజయాలే మా గురించి చెబుతాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఎలా గెలవాలో ఆయన బాగా తెలుసు. ప్రైమరీల్లో ఆయన సాగించిన ప్రచారమే ఇందుకు నిదర్శమ'ని మెలానియ అన్నారు.
అంతకుముందు తన భార్యను సభకు ట్రంప్ పరిచయం చేశారు. అమెరికాకు కాబోయే ప్రథమ మహిళ.. నా భార్య, గొప్ప తల్లి, అద్భుతమైన మహిళ, మెలానియ ట్రంప్' అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.