'నా భర్తది ముమ్మాటికీ తప్పే.. క్షమించండి'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతోన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై రోజురోజుకూ పెరిగిపోతున్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఆయన భార్య మెలానియా రంగంలోకి దిగారు. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఓ (2005 నాటి) వీడియోలో ట్రంప్.. మహిళలను ఉద్దేశించి తీవ్ర అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడమే కాక రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని వదులుకోవాలనే డిమాండ్ వ్యక్తమైంది. క్షమించాల్సిందిగా ట్రంప్ ప్రజలను వేడుకున్నప్పటికీ నిరసనలు ఆగడం లేదు. ఆ వేడిని చల్లార్చేందుకే ట్రంప్ సంతీమణి నేరుగా రంగంలోకి దిగారు.
'నా భర్త మాట్లాడింది నూటికి నూరు శాతం తప్పే. అలాంటి వ్యాఖ్యలు గర్హనీయం. అయితే ఆయనిప్పుడు మునుపటి(2005నాటి) మనిషి కాదు. ఇప్పుడాయనలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. పైగా సదరు కామెంట్లకు ఆయనకూడా క్షమాపణలు చెప్పుకున్నారు. కాబట్టి ప్రజలు ఆయన క్షమాపణలను సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నా' అంటూ మెలానియా ట్రంప్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. (తప్పక చదవండి: వీడియోలో అడ్డంగా దొరికేసిన ట్రంప్)