ఆవిడ గురించి తెలిస్తే.. అబ్బో అనాల్సిందే!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలినియా ట్రంప్ గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. మెలేనియా స్లోవెనియాకు చెందిన వలసదారు. 2005లో బిలియనీర్ రియల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్‌ను పెళ్లాడిన తర్వాతే ఆమె అమెరికా పౌరసత్వం పొందారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే.. అమెరికా మొదటి పౌరురాలి (ఫస్ట్ లేడీ)గా కీర్తి పొందిన రెండో విదేశీయురాలిగా ఆమె గుర్తింపు పొందనున్నారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన జాన్ క్వీన్సీ ఆడం సతీమణి లూసియా కూడా ప్రవాసురాలే.
మ్యాగజీన్ కోసం నగ్నంగా పోజు..
సూపర్ మోడల్ అయిన మెలినియా 1996లో అమెరికాలో తన కెరీర్ ప్రారంభించి.. సొంతంగా వ్యాపారవేత్తగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. 'మెలినియా టైంపీసెస్ అండ్ ఫ్యాషన్ జ్యువెలరీ' పేరిట ఆమె బంగారు అభరణాలు అమ్మే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా 2000 బ్రిటిష్ మ్యాగజీన్ 'జీక్యూ' కోసం ఆమె ఓసారి నగ్నం పోజు ఇచ్చారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే.. ఓ మ్యాగజీన్‌లో నగ్నంగా కనిపించిన తొలి అమెరికా ప్రథమ పౌరురాలు ఆమెనే కానుంది.
డొనాల్డ్ ట్రంప్‌తో ఫస్ట్ డేట్..
డొనాల్డ్ ట్రంపే మొదట మెలినియాపై మనస్సు పడ్డారు. ఆమె ఫోన్ నెంబర్ అడిగారు. అయితే ఆయన అప్పటికే వేరే మహిళతో డేటింగ్ చేస్తుండటంతో మెలినియా నంబర్ ఇవ్వలేదట. 'ఆయన నా నంబర్ అడిగారు. కానీ ఆయన వేరే డేటింగ్ లో ఉన్నారు. అందుకే నేను ఇవ్వలేదు. కానీ ఆయన నంబర్‌ను నేను అడిగాను. తర్వాత కాల్ చేస్తానని చెప్పాను. అయితే, ఆయన ఏ నంబర్ ఇస్తాడోనని నేను అనుకున్నాను. ఒకవేళ వ్యాపార నంబర్ ఇస్తే.. నేను మీతో బిజినెస్ చేయడం లేదని చెప్దామనుకున్నా..' అని అప్పటి విషయాన్ని మెలినియా గుర్తుచేసుకుంటారు. అయితే ట్రంప్ మూడు ఫోన్ నంబర్లు ఇచ్చి ఒకటి ఎంచుకోమని చెప్పాడట. ఆ తర్వాత వారిద్దరు కలువడం, ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి.
రాజకీయాలకు దూరం!
'రాజకీయాలు నా భర్త పని. అందుకే బహిరంగంగా రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను. వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన గురించి ప్రతిదీ నాకు తెలుసు. ఆయనకు సంబంధించిన అన్ని విషయాలూ చూసుకుంటాను. అయినా నేను ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించాను. అది నా సొంతం నిర్ణయం. నేను నాలాగా ఉండటమే ఇష్టం. దానిని మా ఆయన కూడా ఇష్టపడతారని భావిస్తున్నా' అని మెలినియా తెలిపింది.