వాషింగ్టన్: బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఓటమి ప్రధాని నరేంద్ర మోదీని నిరాశపరిచినా అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఆయన హవా కొనసాగుతోంది. 'టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ రీడర్స్' చాయిస్ పోల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం టాప్-10లో నిలిచారు. సోమవారం సాయంత్రానికి మోదీ 2.7 శాతం ఓట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. భారత్లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని ఆధునీకరించేందుకు మోదీ ప్రయత్నించడం వంటి అంశాలను టైమ్ ప్రొఫైల్లో పేర్కొంది. టాప్-10లో మోదీతో పాటు పాకిస్తాన్ ధీర బాలిక, నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్, పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారు.
ఈ పోల్లో అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి బెర్నీ శాండర్స్ (10.5 శాతం) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. శాండర్స్కు తన పోటీదారులు డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్-2.1 శాతం), హిల్లరీ క్లింటన్ (డెమొక్రటిక్-1.4 శాతం)ల కంటే ఎక్కువ మద్దతు లభించింది. ఇక మలాలా (5.9 శాతం), పోప్ ఫ్రాన్సిస్ (3.9 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నాలుగు, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ పది స్థానాల్లో ఉన్నారు. ఇక భారత సంతతికి చెందిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ 1.5 శాతం ఓట్లతో 25వ స్థానంలో నిలిచారు. చాయిస్ పోల్ ఓటింగ్ ఈ నెల 4వ తేదీతో ముగియనుంది. విజేతను 7న ప్రకటిస్తారు.
టాప్-10లో ప్రధాని మోదీ
Published Tue, Dec 1 2015 3:18 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement